![]() |
![]() |

టీవీ వీక్షకులంతా ఎప్పుడెప్పుడా అని అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తూ వస్తోన్న బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే మరికొద్ది గంటల్లో మన ముందు ఆవిష్కృతం కాబోతోంది. థర్డ్ సీజన్ తరహాలోనే ఫోర్త్ సీజన్‌కూ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ, షోను రక్తి కట్టిస్తూ వచ్చారు. మొదట్లో వీక్ డేస్‌లో ఈ షో టీఆర్పీ దారుణంగా ఉండటంతో నిర్వాహకులు కంగారు పడిన మాట నిజం. నాలుగో వారం నుంచి క్రమంగా వేడి రాజుకుంటూ వచ్చి, ఆశించిన రీతిలో టీఆర్పీ పెరగడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
విన్నర్స్ ట్రోఫీ కోసం మొత్తం 19 మంది కంటెస్టెంట్లు రంగంలోకి దిగిన బిగ్ బాస్ 4లో చివరి వారానికి టాప్ 5 కంటెస్టెంట్లుగా అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సొహేల్ బరిలో నిలిచారు. ఈ ఐదుగురిలో విజేతగా ఎవరు నిలుస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వీక్షకుల అభిమానాన్ని అమితంగా సంపాదించడంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో అభిజీత్ సక్సెస్ అయ్యాడు. వివిధ ఆన్‌లైన్ సర్వేలలోనూ, సోషల్ మీడియాలోనూ అతడికి వెల్లువెత్తుతున్న ఆదరణతో పోలిస్తే మిగిలిన కంటెస్టెంట్లు ఆమడ దూరంలో ఉన్నారు. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజీత్ అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
నిర్వాహకులు హాట్ స్టార్ స్ట్రీమింగ్ సైట్ ద్వారా మిస్ట్ కాల్ పోల్ పెట్టారు. దీనికి రికార్డ్ స్థాయిలో 20 కోట్ల దాకా ఓట్లు పడ్డాయని వినిపిస్తోంది. అదే నిజమైతే ఓ రీజనల్ లాంగ్వేజ్ షోకు సంబంధించి ఇది పెద్ద సంచలన విషయం కానున్నది. ఆ ఓట్లలో అత్యధిక శాతం అభిజీత్‌కు పడి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఫిషియల్‌గా ఏ కంటెస్టెంట్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయనేది ఈ రోజు రాత్రి జరిగే గ్రాండ్ ఫినాలేలో వెల్లడి కానున్నది. అయినప్పటికీ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పలువురు పెట్టిన ఆన్‌లైన్ పోల్స్ అన్నింటిలోనూ అభిజీత్ తిరుగులేని ఆదరణ పొందడం గమనించదగ్గ అంశం.
ఈ ఆన్‌లైన్ పోల్స్‌లో 60 శాతానికి మించి ఓట్లు అభిజీత్‌కే దక్కాయి. మిగిలిన ఓట్లలో సయ్యద్ సొహేల్, అరియానా గ్లోరీ ఓ మోస్తరు ఓట్లను సాధించగా, అఖిల్, హారిక తక్కువ శాతం ఓట్లను పొందారు. ఈ ధోరణే హాట్ స్టార్ ఓటింగ్‌లోనూ ప్రతిఫలిస్తే అభిజీత్ అత్యధిక శాతం ఓట్లను సాధిస్తాడనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. గమనించాల్సిన అంశమేమంటే.. అఖిల్, సొహేల్‌లతో పోలిస్తే టాస్క్‌లు కంప్లీట్ చేయడంలో అభిజీత్ బాగా వెనుకపడ్డాడు. ఫలితంగా 11 సార్లు నామినేషన్‌కు గురై, సేఫ్‌గా బయటపడుతూ వచ్చాడు. రోబో టాస్క్‌ను మైండ్ గేమ్‌తో అతడు ఆడిన విధానం వల్లే వీక్షకుల్లో అంతగా అభిమానం సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అక్కడ్నుంచే అభిజీత్ పేరు షోలో మారుమోగుతూ వచ్చింది.
గత సీజన్లను పరిశీలించినా టాస్క్‌లు బాగా చేయని వాళ్లే విన్నర్స్‌గా నిలిచారు. థర్డ్ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ ఏ టాస్క్‌నూ సరిగా చేసిన పాపాన పోలేదు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా విరగదీసుకొని టాస్క్‌లను ఫినిష్ చేయడానికి పోటీ పడేవాళ్లు. రాహుల్ తాపీగా మైండ్ గేమ్ ఆడుతూ మిగతావాళ్లు రెచ్చిపోయేలా చేసేవాడు. చివరకు శ్రీముఖితో పోరులో విజయం సాధించి, ట్రోఫీ గెల్చుకున్నాడు. సెకండ్ సీజన్‌లో కౌశల్ అయినా, ఫస్ట్ సీజన్‌లో శివబాలాజీ అయినా ఇదే రీతిలో మైండ్ గేమ్ అప్లై చేసి, విన్నర్స్‌గా నిలిచారు. ఆ ప్రకారం చూస్తే ఫోర్త్ సీజన్‌లో అభిజీత్ విజేత కావడం తథ్యమనే అభిప్రాయం కలుగుతోంది. పైగా మునుపటి మూడు సీజన్లలో ఆన్‌లైన్ ఓటింగ్స్‌లో ఎవరికీ దక్కనంత ఆదరణ ఈసారి అభిజీత్‌కు దక్కుతోంది.
అభిజీత్ తర్వాత అరియానా, సొహేల్ కూడా వీక్షకుల ఆదరణను కొంత సంపాదించుకోగలిగారు. భావోద్వేగాలను ప్రదర్శించే విషయంలో సొహేల్ నిజాయితీగా ఉన్నాడని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తన గ్లామర్, క్యూట్ లుక్స్‌తో అరియానా వీక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ విషయంలో ఆమెకంటే బెటర్ అయిన సినీ హీరోయిన్ మోనాల్ గజ్జర్.. బిహేవియర్ విషయంలో వెనుకబడ్డం వల్లే టాప్ ఫైవ్‌లో చోటు సంపాదించుకోలేక, ఆరో స్థానంతో సరిపెట్టుకొని హౌస్ నుంచి నిష్క్రమించింది. అయితే హౌస్‌లో ఆమె వల్లే కాస్త మసాలా యాడ్ అయ్యిందనేది నిజం. ఆమె ప్రవర్తనతో వీక్షకులు విసిగిపోయినా, చివరి దాకా ఆమె హౌస్‌లో కొనసాగిందంటే.. బిగ్ బాస్ ఆమెపై చూపిన దత్తపుత్రిక అభిమానమే కారణమని చాలామంది ఫీలింగ్.
అయితే వీక్షకుల ఓటింగ్ అభిజీత్‌కు అత్యధిక స్థాయిలో పడినా, చివరి నిమిషంలో అనూహ్యమైనదేదైనా జరిగి, మిగతా నలుగురిలో ఎవరైనా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే అభిజీత్ కాకుండా ఇంకెవరు విజేతగా నిలిచినా వీక్షకులు జీర్ణం చేసుకొనే పరిస్థితి కనిపించడం లేదు.
గంగవ్వ, మెహబూబ్, లాస్య, జబర్దస్త్ అవినాష్, దివి వడ్త్య, కుమార్ సాయి, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, నోయల్ షాన్, యాంకర్ దేవి, డైరెక్టర్ సూర్యకిరణ్, కరాటే కల్యాణి, స్వాతి దీక్షిత్ ఈ నాలుగో సీజన్‌లో హౌస్‌లో తమ వంతు పాత్రను పోషించి, బయటకు వచ్చేశారు. వీరందరిలో గంగవ్వ, లాస్య, నోయల్, యాంకర్ దేవి, అవినాష్, అమ్మ రాజశేఖర్ కొద్దో గొప్పో వీక్షకులకు వినోదాన్ని పంచారు.
ఆదివారం రాత్రి మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య, డాన్స్ పర్ఫార్మెన్స్‌తో, స్కిట్స్‌తో, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ పర్ఫార్మెన్స్‌తో గ్రాండ్ ఫినాలే రసవత్తరంగా జరగనుంది. థర్డ్ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ట్రోఫీని అందజేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సీజన్ విన్నర్‌కూ ట్రోఫీని అందించే సీన్ చూసి, ఆనందించడమే తరువాయి.
![]() |
![]() |