![]() |
![]() |

కొన్నేళ్ల క్రితం సమంతపై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. కారణం.. మహేశ్ సినిమా పోస్టర్‌కు సంబంధించి సమంత చేసిన కామెంట్స్. ఆ సినిమా '1.. నేనొక్కడినే'. ఆ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌ను చూసిన సమంత తట్టుకోలేకపోయింది. దాన్ని చూడగానే తన మనసులో కలిగిన అభిప్రాయాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వ్యక్తం చేసింది.
"Saw a poster of a yet to be released Telugu film.Not only is it deeply regressive,but it's point is actually that it is deeply regressive" అంటూ విమర్శించింది. మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఆ పోస్టర్ దారుణమైన తిరోగమన స్థాయిలో ఉందని ఆమె విరుచుకుపడింది.

ఆమె సినిమా పేరు ప్రస్తావించకపోయినా '1.. నేనొక్కడినే' పోస్టర్‌ని ఉద్దేశించే ఆమె అలా స్పందించిందని అందరికీ అర్థమైపోయింది. ఇంతకీ.. ఆ పోస్టర్‌లో ఏముంది? బీచ్‌లో మహేశ్ చేతిలో షూస్ పట్టుకొని, నగ్న పాదాలతో నడుచుకుంటూ వెళ్తుంటే, అతని వెనుక హీరోయిన్ కృతి సనన్ మోకాళ్లు, చేతులతో పాకుతూ వస్తుంటుంది. సమంతకు సపోర్ట్‌గా సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఇద్దరిపై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. గెట్ లాస్ట్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని ట్రోల్ చేశారు. అంతే కాదు. సమంత నటించగా, మగవాళ్లను కించపరిచేలా ఉండే సీన్లను ఫొటోలతో సహా షేర్ చేసి, ఘాటు కామెంట్లు పెట్టారు.

అయితే సమంత తన సినిమా పోస్టర్ గురించి ఘాటుగా విమర్శించినా, ఆమెపై తన ఫ్యాన్స్ యుద్ధం ప్రకటించినా మహేశ్ కూల్‌గా ఉన్నాడు. అంతే కాదు, ఆ తర్వాత కూడా సమంతతో 'బ్రహ్మోత్సవం' చిత్రంలో కలిసి నటించాడు. కావాలనుకుంటే ఆమెతో కలిసి నటించడానికి అతను విముఖత చూపించవచ్చు కూడా. కానీ మహేశ్ అలా చేయలేదు. అతడే కాదు, ఆ పోస్టర్‌ను రిలీజ్ చేయడంలో ప్రధాన పాత్రధారి అయిన డైరెక్టర్ సుకుమార్ కూడా సమంతపై ఎలాంటి కక్షా పెట్టుకోలేదు. 'రంగస్థలం'లో నాయికగా ఆమెనే తీసుకున్నాడు. ఆ సినిమాలో సమంతకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలిసిందే కదా.. హీరోల తరపున వకాల్తా పుచ్చుకొని ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినా, ఆ హీరోలు పెద్దగా పట్టించుకోరనేందుకు ఇదో ఉదాహరణ.
![]() |
![]() |