![]() |
![]() |

తమిళ హీరో కార్తీ తెలుగునాట కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. అతని కంటే ముందు నుంచే అతని అన్న సూర్య సినిమాలు తెలుగులో రిలీజవుతూ వున్నప్పటికీ సూర్యకు తెలుగులో మాట్లాడ్డం రాదు. కానీ కార్తీ మాత్రం తెలుగు నేర్చుకొని, తన సినిమాల ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తెలుగులోనే మాట్లాడుతుంటాడు. గత ఏడాది అతను నటించిన 'ఖైదీ' మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది.
సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ కూడా ఒకప్పుడు తమిళంలో పేరున్న హీరోనే. అయినప్పటికీ కొడుకులను ఆయన గోల్డ్ స్పూన్‌తో పెంచలేదు. సాధారణ పిల్లలుగానే వారిని పెంచారు. సినిమాల్లోకి రాకముందు కార్తీ ఓ మామూలు ఉద్యోగిగా పనిచేశాడంటే ఆశ్చర్యం కలగకమానదు. "నాకు మామూలు మధ్యతరగతివాడిలా మసలడంలోనే ఆనందం ఉంది. నేను చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం అలాంటిది. స్టార్ కొడుకులా ఎప్పుడూ పెరగలేదు." అని చెప్పాడు కార్తీ.
సూర్య బీకాం చదివి ఇక చదవనని చేతులెత్తేశాడు. కార్తీ అలా కాదు. "నేను చాలా బ్రిలియంట్ స్టూడెంట్‌ని. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత న్యూయార్క్‌లో ఎమ్మెస్ చేశాను. ఇక్కడ బీఈ చదువుతున్నన్ని రోజులూ నాకు బైక్ కూడా ఉండేది కాదు. బస్‌లోనే కాలేజ్‌కి వెళ్లేవాణ్ణి. ఎమ్మెస్ అయిపోగానే.. కష్టపడి ఇక్కడే ‘కలర్ ప్లస్’ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. నెలకు 4,300 రూపాయల జీతం. రోజుకి 12 గంటలు కష్టపడి పనిచేసేవాణ్ణి. అందుకే నాకు సగటు మనిషి జీవన శైలి బాగా తెలుసు." అంటూ తెలిపాడు కార్తీ.
![]() |
![]() |