![]() |
![]() |

దేశంలోని ప్రజానీకానికి 2020 ఎప్పటికీ మరపురాని సంవత్సరంగా గుర్తుండిపోతుంది. అయితే అది తీపి జ్ఞాపకంగా కాకుండా, చేదు జ్ఞాపకంగా. కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం స్తంభించిపోవడం ఏ రకంగా చూసినా అనూహ్యమైన విషయం. ఏ సినిమాలోనైనా అసాధారణ విషయం చూపిస్తే.. దాన్ని లాజిక్‌లెస్‌గా మనం భావిస్తాం.. కానీ కరోనా అనేది లాజిక్‌తో సంబంధం లేకుండా అందరి జీవితాల్నీ ప్రభావితం చేసింది. సినిమా కథకు మించిన బ్యాక్‌డ్రాప్ కరోనా అని తేలిపోయింది. మనిషిని చూసి మనిషి భయపడే, తోటి మనిషికి దూరంగా మెలగాల్సిన స్థితి వస్తుందని ఎన్నడైనా ఊహించామా.. అలా 2020 ఒక అసాధారణ సంవత్సరంగా అందరి డైరీల్లో నిలిచిపోయింది.
సినిమా ఇండస్ట్రీ అయితే కుదేలైపోయింది. షూటింగ్‌లు ఆగిపోవడం దగ్గర్నుంచి, థియేటర్లు మూతపడటం దాకా అనేక దెబ్బలు తగలడంతో ఇప్పట్లో చిత్రసీమ కోలుకుంటుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇన్నింటి ప్రతికూలతల మధ్య కొంతమంది సెలబ్రిటీలు ఈ సంవత్సరంలోనూ తమ ముఖాలపై నవ్వులు పూయించుకోగలిగారు.. పెళ్లి అనే ఒక ఘట్టంతో! ఈ సంక్లిష్ట స్థితిలోనూ తమ జీవితాల్లో ఆనందాన్ని నింపిన ప్రేమికుల్ని వారు పెళ్లాడారు. జీవితంలో అతి ప్రధాన ఘట్టానికి ఈ ఏడాదే వారు స్వాగతం పలికారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీలెవరంటే...
రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి, తన చిరకాల గాళ్ ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన వేడుకలో ఆగస్ట్ 8న కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.
నితిన్-షాలిని

హీరో నితిన్, తన చిరకాల ప్రేయసి షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జూలై 26న కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో పెళ్లాడాడు.
కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు

టాలీవుడ్‌లోని అగ్ర నాయికల్లో ఒకరిగా రాణిస్తున్న చందమామ కాజల్ అగర్వాల్, తన బాయ్ ఫ్రెండ్, ఇంటీరియర్ డిజైన్ బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న ముంబైలో పెళ్లి చేసుకుంది.
నిహారిక కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ

నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకొనే నిహారిక కొణిదెల వివాహం గుంటూరు రేంజి ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా హాజరై ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు.
సుజిత్-ప్రవల్లిక

'రన్ రాజా రన్', 'సాహో' సినిమాల దర్శకుడు సుజిత్ రెడ్డి, డెంటిస్ట్ అయిన ప్రవల్లికను ఆగస్ట్ 2న హైదరాబాద్‌లో వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.
నిఖిల్-పల్లవీ వర్మ

హీరో నిఖిల్ సిద్ధార్థ లాక్‌డౌన్ కాలంలో తన ఫియాన్సీ పల్లవీ వర్మను మే 14న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లో పెళ్లాడాడు.
మహత్ రాఘవేంద్ర-ప్రాచీ మిశ్రా

'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్', 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' సినిమాల హీరో మహత్ రాఘవేంద్ర, తన చిరకాల స్నేహితురాలు ప్రాచీ మిశ్రాను ఫిబ్రవరి 1న చెన్నైలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.
సనా ఖాన్-అనస్ సయేద్

టాలీవుడ్‌లో కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా నటించిన సనా ఖాన్, గుజరాత్‌కు చెందిన అనస్ సయేద్‌ను నవంబర్ 20న నిఖా చేసుకుంది. దీనికి కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు.
నీతి టేలర్-పరీక్షిత్ బవా

'మేం వయసుకు వచ్చాం' హీరోయిన్ నీతి టేలర్ ఆగస్ట్ 13న లాక్‌డౌన్ కాలంలోనే పరీక్షిత్ బవాను సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది.
![]() |
![]() |