మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ 'మర్డర్' మూవీని తీసున్న విషయం మనకు తెలిసిందే. ప్రధానంగా తండ్రీకూతుళ్లు మారుతీరావు, అమృత పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కాగా ఇదే కథతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. కాకపోతే తెలుగులో కాదు, తమిళంలో. నాలుగు కథలతో తమిళంలో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో కథను ఒక్కో డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. ఆ నలుగురు డైరెక్టర్లు.. గౌతమ్ మీనన్, వెట్రిమారన్, సుధ కొంగర, విఘ్నేశ్ శివన్.
పరువు హత్యల నేపథ్యంలో నడిచే ఈ నాలుగు కథల్లో ఒకటిగా అమృత, ప్రణయ్ ప్రణయగాథ కూడా ఉంటుందని కోలీవుడ్ సమాచారం. దీన్ని వెట్రిమారన్ రూపొందిస్తాడంటున్నారు. ఇందులో అమృతగా సాయిపల్లవి, మారుతీరావుగా ప్రకాశ్‌రాజ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించడం ఖాయం.
ప్రస్తుతం సాయిపల్లవి ఆసక్తికర ప్రాజెక్టులు చేస్తోంది. వేణు ఊడుగుల సినిమా 'విరాటపర్వం'లో డిగ్రీ స్టూడెంట్‌గా నటిస్తోన్న ఆమె, శేఖర్ కమ్ముల మూవీ 'లవ్ స్టోరి'లో నాగచైతన్య జోడీగా కనిపించనున్నది. శ్యామ్‌సింగ రాయ్‌లో నాని సరసన ఓ నాయికగా నటించేందుకు అంగీకరించిన ఆమె, అజయ్ భూపతి అప్‌కమింగ్ ఫిల్మ్ 'మహాసముద్రం'లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.