నటీనటులు: విద్యా బాలన్, సాన్యా మల్హోత్రా, జిష్షుసేన్ గుప్తా, అమిత్ సాద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కేకూ నకహర
నేపథ్య సంగీతం: కరణ్ కులకర్ణి
పాటలు: సచిన్-జిగర్
దర్శకత్వం: అను మీనన్
నిర్మాతలు: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్, విక్రమ్ మల్హోత్రా
విడుదల తేదీ: 31 జూలై 2020 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో)
'బేబీ చాహియే థా, పతీ నహీ' (బేబీ కావాలి, భర్త వద్దు) - 'శకుంతలాదేవి' బయోపిక్ ట్రైలర్లో డైలాగ్. ఆమె అన్నట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు పొందిన శకుంతలాదేవి, ఓ అమ్మాయికి జన్మనిచ్చిన కొన్నేళ్ల తరవాత భర్తను వద్దనుకుని, ఆయనకు దూరంగా జీవించారు. ఎందుకు? ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'శకుంతలాదేవి' సినిమాలో దొరుకుతాయి. మ్యాథమెటిక్స్ జీనియస్ వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చదవండి.
కథ: శకుంతలాదేవి (విద్యా బాలన్) మీద అనుపమ బెనర్జీ (సాన్యా మల్హోత్రా) లండన్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేస్తుంది. కన్నతల్లిని కూతురు ఎందుకంత ద్వేషించింది? ప్రపంచంలో హ్యూమన్ కంప్యూటర్‌గా జేజేలు అందుకున్న శకుంతలాదేవి వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది? బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్:
విద్యా బాలన్
సాన్యా మల్హోత్రా నటన
తల్లీకూతుళ్ల మధ్య సన్నివేశాలు
దర్శకత్వం
శకుంతలాదేవి జీవితంలో భావోద్వేగాలు
మైనస్ పాయింట్స్:
సినిమాటిక్ ముగింపు
లెక్కల నేపథ్యంలో సన్నివేశాలు
నేపథ్య సంగీతం
విశ్లేషణ: ఇదొక హ్యూమన్ కంప్యూటర్ బయోపిక్ లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ జీవితమో కాదు. ఇదొక తల్లీకూతుళ్ల కథ. ఇటు కన్న కూతురికి దూరం కాలేక, అటు లెక్కలను దూరం చేసుకోలేక ఓ తల్లి పడే సంఘర్షణకు దృశ్యరూపం ఈ సినిమా.
మాతృత్వపు మధురిమను ఆస్వాదించాలంటే ప్రతి మహిళ వృత్తిపరమైన జీవితానికి, అప్పటివరకూ చేస్తున్న ఉద్యోగాలకు స్వస్తి పలకాల్సిందేనా? మనసుకు నచ్చిన పని చేయడం మానేయాల్సిందేనా? ప్రతి మహిళకు ఎదురయ్యే సంఘర్షణ ఇది. ఒకవేళ వృత్తిపరమైన జీవితాన్ని వదులుకోకూడదని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఏమైందనేది 'శాకుంతలాదేవి' సినిమా.
'పెదవే పలికిన తీయని మాటే అమ్మ' అని ఓ పాటలో తెలుగు గేయ రచయిత అన్నారు. ప్రతి బిడ్డ పలికే తొలి మాట కూడా అమ్మే. కానీ, శకుంతలాదేవి కుమార్తె మాత్రం 'నాన్న' అంటుంది. అది తట్టుకోలేని శకుంతలాదేవి భర్తతో గొడవపడి బిడ్డను తనతో తీసుకువెళుతుంది. తండ్రికి దూరమైన బిడ్డ, తల్లి పేరు ప్రఖ్యాతల నీడలో పెరిగిన బిడ్డ, తల్లితో జీవితాన్ని ఇష్టపడదు. అయితే, తాను తల్లి అయిన తరవాత తన తల్లిని ఎలా అర్థం చేసుకుందనే సన్నివేశాలను దర్శకురాలు అను మీనన్ అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే... తల్లిపై ద్వేషంతో మాట్లాడడం మానేసిన శంకుతలాదేవి, తనతో కుమార్తె మాట్లాడటం మానేసే సరికి తన తప్పును ఎలా తెలుసుకుందనేదీ భావోద్వేగభరితంగా చూపించారు.
సినిమాలో తల్లీకూతుళ్ల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. హృదయానికి హత్తుకుంటుంది. అయితే, లెక్కల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోవు. లాజిక్ లేనట్టు అనిపిస్తుంది. కంప్యూటర్ కంటే వేగంగా శకుంతలాదేవి స్పీడుగా లెక్కలను ఎలా పరిష్కరించగలుగుతోంది అనేది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించలేదు. అందువల్ల, సినిమా ప్రారంభంలో ఆ సన్నివేశాలు ఆసక్తిగా అనిపించినా పోను పోను బోరింగ్ గా మారాయి. స్పానిష్ వ్యక్తితో సన్నివేశాలు సినిమాను సాగదీసినట్టు అనిపిస్తాయి. హోమోసెక్సువాలిటీ మీద శకుంతలాదేవి ఎందుకు పుస్తకం రాసింది? ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాలనుకుంది? జ్యోతిష్యం వైపు ఎందుకు మళ్ళంది? ఇలాంటి విషయాల్లో ఈ సినిమా స్పష్టత ఇవ్వలేదు.
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అప్పటి వాతావరణాన్ని ఆవిష్కరించాయి. మాటలు క్లుప్తంగా కథలో భావాన్ని వ్యక్తం చేశాయి. నటీనటుల చేత దర్శకురాలు అను మీనన్ చక్కటి నటన రాబట్టుకుంది. అయితే, నేపథ్య సంగీతం మరింత ఎఫెక్టివ్ గా ఉంటే బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
నటీనటుల పనితీరు: శకుంతలాదేవి పాత్రలో విద్యా బాలన్ జీవించారు. వయసురీత్యా వివిధ దశల్లో పాత్రకు తగ్గట్టు గెటప్, లుక్ మార్చి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్ననాటి ఇంటికి వెళ్లిన సన్నివేశంలో, పతాక సన్నివేశాలలో ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తారు. సాన్యా మల్హోత్రా కూడా విద్యా బాలన్‌కి ధీటుగా నటించారు. అమిత్ సాద్, జిష్షుసేన్ గుప్తా, ప్రకాష్ బేలవాడి తదితరులు పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: ప్రస్తుత ప్రపంచంలో సింగిల్ మదర్స్ చాలామంది ఉన్నారు. ఒంటరిగా పిల్లలను పెంచిపెద్ద చేస్తున్నారు. కానీ, యాభై అరవై ఏళ్ళ క్రితం ఓ భారతీయ మహిళ భర్తను వద్దని అనుకోవడం డేరింగ్ స్టెప్. అటువంటి స్టెప్ తీసుకున్న శకుంతలాదేవి జీవితంలో బోలెడు భావోద్వేగాలు ఉన్నాయి. వాటిని ఆవిష్కరించిన సినిమా. వినోదం, భావోద్వేగం, అద్భుత అభినయం ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి బిడ్డ తల్లిని తల్లిలా కాకుండా, ఓ మహిళలా చూడామని సందేశం ఇస్తుందీ సినిమా.
రేటింగ్: 3/5