క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తున్నాడు రామ్‌గోపాల్ వర్మ. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకొనే అవకాశం లేకపోవడంతో, దీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా డబ్బులు సంపాదించాలని నిశ్చయించుకున్నాడు. దాని కోసం ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ను ప్రారంభించాడు. థియేటర్లు ఓపెన్ అయ్యేలోగా వీలైనని షార్ట్ ఫిలిమ్స్ తీసేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. జానర్, బడ్జెట్, లెంగ్త్ వంటివేవీ ఆయన పట్టించుకోవట్లేదు. 'నగ్నం'ను 22 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌గా తీసిన ఆయన, 'పవర్ స్టార్'ను 37 నిమిషాల నిడివితో నిర్మించాడు.
ఇప్పుడు వరుసగా 'మర్డర్', 'థ్రిల్లర్', 'కరోనా' ఫిల్మ్‌లను రిలీజ్‌కు రెడీ చేస్తున్న ఆయన మరో మూవీని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇదివరకు ప్రచారంలోకి వచ్చినట్లు ఉదయ్ కిరణ్ బయోపిక్ కాకుండా తన పేరుతోనే ఆయన ఓ మూవీని తీయనున్నాడు. దాని పేరు 'ఆర్జీవీ మిస్సింగ్' అని వినిపిస్తోంది. ఇప్పుడు చాలామంది ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. అంటే ఆయనకు శత్రువులు బాగా పెరిగిపోయారు. ఈ నేపథ్యంతో ఆర్జీవీ కనిపించకుండో పోతే ఏమవుతుంది? ఆర్జీవీ ఎందుకు మిస్సయ్యాడు?.. అనే పాయింట్లతో థ్రిల్లర్ జానర్‌లో ఈ ఫిల్మ్‌ను తీయనున్నాడని వినిపిస్తోంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను ఆయన చేపడతాడనేది ప్రచారంలోకి వచ్చింది.