సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను అతడి ప్రేయసి రియా చక్రవర్తి మానసికంగా వేధించిందా? రియా సహా ఆమె కుటుంబ సభ్యులు అతడిని బ్లాక్ మెయిల్ చేశారా? డబ్బులు తీసుకున్నారా? అవి తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? రియా చక్రవర్తి మీద సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కె.కె. సింగ్ పెట్టిన కేసుతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సుశాంత్ రోజువారీ జీవితంలో రియా చక్రవర్తి ఫ్యామిలీ తలదూర్చిందని కె.కె. సింగ్ ఆరోపించారు. గతంలో అతడు నివసించిన ఫ్లాట్‌లో దెయ్యం ఉందని నమ్మించి, తరవాత వేరే రిసార్టుకు తరలించారనీ, ఆ తరవాత రియా తన ఫ్లాట్‌కి తీసుకువెళ్లిందని ఆయన పేర్కొన్నారు. సుశాంత్‌కు డెంగ్యూ ఉందని అందరికీ చెబుతూ, ఓవర్ డోస్ మెడిసిన్ ఇచ్చిందని కేకే సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా సుశాంత్ బ్యాంకు ఎకౌంటులో 17 కోట్ల రూపాయలకు గాను, రూ. 15 కోట్లు తన కుమారుడికి సంబంధం లేని వివిధ ఎకౌంటులకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని, దీని వెనుక రియా చక్రవర్తి ఉందనేది సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణ. తన కుమారుడి అభిమతానికి విరుద్ధంగా రియా చాలా పనులు చేసిందనీ, మాట వినకపోతే మెంటల్ హెల్త్ సమస్యల గురించి బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసిందనీ ఆయన పేర్కొన్నారట. రియా చక్రవర్తి చర్యల వలన తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన కేసు పెట్టారు. వీటిపై రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.