![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'. ఆ తర్వాత ఆయన రెండేళ్లకు పైగా 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి పరిమితమైపోయారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి దేశ విదేశాలలో జూనియర్ ఎన్టీఆర్ సత్తాను చాటింది. విదేశాలలో సైతం అతని నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆ ఆనందం తారక్ అభిమానులకు పెద్దగా సంతోషంగా అనిపించడం లేదు. దానికి కారణం తారక్ తన తదుపరి చిత్రాల విషయంలో క్లారిటీ లేకుండా ఉండడమే.
తారక్ సోలో హీరోగా వచ్చి ఐదేళ్లయింది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత వెంటనే కొరటాల శివతో 30వ సినిమా ప్రారంభిస్తాడని భావిస్తే ఆ సినిమా ఇప్పటివరకు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు. ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు దీని తరువాత తారక్ 'కేజిఎఫ్' ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి.
ప్రశాంత్ నీల్ కూడా తారక్ కి వీరాభిమాని. దాంతో ఆయన కచ్చితంగా తారక్ తో సినిమా చేస్తానని ప్రకటించారు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో 'సలార్' చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత నీల్.. తారక్ తో చేస్తాడని అందరూ భావించారు. కానీ మధ్యలోనే దిల్ రాజు వచ్చి చేరారు. 'సలార్' పూర్తయిన వెంటనే ప్రభాస్, ప్రశాంత్ కాంబినేషన్‌లో 'రావణం' అనే చిత్రం ఉంటుందని... ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతుందని క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే 'కేజిఎఫ్ 3' ఉంటుందని హోంబళే ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 'సలార్'తో పాటు 'రావణం', 'కేజిఎఫ్ 3' పూర్తి చేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగు ఏళ్ళు పడుతుంది. అంటే అప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చిత్రం ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ సినిమాని చేస్తూనే ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రశాంత్ నీల్ చిత్రాన్ని ప్రారంభించాలని భావించారు. 'సలార్' మూవీ విడుదలైన వెంటనే తన చిత్రం ఉండేలా చూసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి సందిగ్ధంలో పడింది. మరి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం ఉంటుందా, లేదా? ఉంటే ఎప్పుడు మొదలవుతుంది? వంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
![]() |
![]() |