![]() |
![]() |

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రమిది. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ గతేడాది అక్టోబర్ లో విడుదల చేసిన టీజర్ అంచనాలకు అందుకోలేకపోయింది. ముఖ్యంగా పాత్రలు వేషధారణ, వీఎఫ్ఎక్స్ పట్ల ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరింత సమయం తీసుకోవాలని భావించిన మేకర్స్.. చిత్రాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడటంతో.. కొద్దిరోజులుగా ఆదిపురుష్ ట్రైలర్ పై అందరి దృష్టి పడింది. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. అదేసమయంలో టీజర్ లాగే నిరాశపరుస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ తాజాగా విడుదలైన ట్రైలర్ కట్టిపడేస్తోంది.
'ఆదిపురుష్' ట్రైలర్ ను మంగళవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఓ గుహలో హనుమంతుడు ధ్యానం చేస్తుండగా.. "ఇది నా రాముడి కథ" అంటూ ఆయన వాయిస్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. శ్రీరాముడు ఆజానుబాహుడు అనే దానికి అద్దంపట్టేలా ప్రభాస్ రూపం ఉంది. ఆయనలో రాజసం ఉట్టిపడుతోంది. "భిక్షామ్ దేహి" అంటూ రావణుడు మారు వేషంలో వచ్చి సీతను అపహరించడం, రాముడిని తలచుకుంటూ అశోకవనంలో సీత బాధపడటం, శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తినడం, హనుమంతుడు లంకాదహనం చేయడం, వానర సైన్యంతో కలిసి రామసేతు నిర్మించి రాముడు లంకలోకి ప్రవేశించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ను రూపొందించారు. టీజర్ తో పోల్చితే విజువల్ గా ట్రైలర్ చాలా మెరుగ్గా ఉంది. కొన్ని కొన్ని షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే చివరిలో శివపూజ సమయంలో రావణుడి గెటప్ మాత్రం టీజర్ లో ఉన్నట్టే ఉంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ పై మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంది. ఆ ఆలోచనతోనే ట్రైలర్ లో రావణుడి షాట్స్ ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడ్డారేమో అనిపిస్తోంది. మరి రావణుడికి పొడవాటి జుట్టు పెట్టకుండా, అలా షార్ట్ హెయిర్ స్టైల్ పెట్టడం వెనక కారణమేంటో తెలియాల్సి ఉంది. మొత్తానికి ట్రైలర్ అయితే టీజర్ తో పోల్చితే చాలా చాలా మెరుగ్గా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ వన్ మ్యాన్ షో అన్నట్టుగా ఉంది. మరి శ్రీరాముడిగా ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |