మాస్ మహారాజా రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో `భద్ర` ఒకటి. `మాస్ ఎంటర్టైనర్స్`కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను ఈ సినిమాతోనే దర్శకుడిగా తొలి అడుగేశారు. విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ (`దిల్` రాజు నిర్మాణం) నిర్మించిన ఈ సమ్మర్ సెన్సేషన్ లో రవితేజకి జోడీగా మీరా జాస్మిన్ నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దీపక్, ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, మురళీ మోహన్, సునీల్, బ్రహ్మాజీ, పద్మనాభం, ఈశ్వరీరావ్, రేవతి, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలతో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``తిరుమలవాసా``, ``ఏమైందీ సారూ``, ``జస్ట్ డూ ఇట్``, ``నువ్వు నాకు మనసిస్తే``, ``ఓ మనసా``, ``ఎర్రకోక పచ్చరైక``, ``ఏవూరే చినదానా``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించింది. తమిళంలో `శరవణ` (శింబు, జ్యోతిక), కన్నడంలో `గజ` (దర్శన్, నవ్యనాయర్), బెంగాలీలో `జోష్` (జీత్, స్రబంతి మలకర్), బంగ్లాదేశీలో `భలోబేషే మోర్టే పరి` (షకీబ్ ఖాన్, సహారా) పేర్లతో `భద్ర` రీమేక్ అయింది. 2005 మే 12న విడుదలై అఖండ విజయం సాధించిన `భద్ర`.. నేటితో 16 వసంతాలను పూర్తిచేసుకుంది.