నటుడు, జర్నలిస్టు తుమ్మల నరసింహరెడ్డి(టీఎన్ఆర్) కుటుంబానికి నటుడు సంపూర్ణేష్ బాబు 50 వేల రూపాయల సాయం చేశారు. టీఎన్ఆర్ ఇటీవల కరోనా కాటుకి బలైన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో ఇంటర్వ్యూల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటుడిగానూ రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన కరోనా కారణంగా కన్నుమూశారు. దీంతో ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన కుటుంబానికి అండగా ఉండటానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబానికి తక్షణ సాయం కింద లక్ష రూపాయల ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. అదే బాటలో సంపూ కూడా పయనించారు. రూ.50 వేలు సాయం చేయడంతో పాటు టీఎన్ఆర్ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో సంపూపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సంపూ రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇదిలాఉంటే టీఎన్ఆర్ కుటుంబానికి సాయం చేయండి అంటూ కొందరు సోషల్ మీడియాలో కోరుతుండగా దీనిపై కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి టీఎన్ఆర్ సన్నిహితులు వివరణ ఇచ్చారు. గత నెలలో టీఎన్ఆర్ సోదరి కరోనా బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమించి చాలారోజుల పాటు హాస్పిటల్ లోనే ఉన్నారు. సోదరిని బ్రతికించుకోవడం కోసం టీఎన్ఆర్ తన సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టారని అంటున్నారు. అంతేకాదు ఆయన సినిమాలకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని, కొత్తవారిని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో కొన్నిసార్లు రెమ్యూనరేషన్ కూడా తీసుకునేవాళ్ళు కాదని చెబుతున్నారు. ఇది తెలిసి సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఆయన కుటుంబానికి సాయం చేస్తున్నారు.