మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఘని, F3 సినిమాలలో నటిస్తున్న వరుణ్ తేజ్ త్వరలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఛలో(2018) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అనంతరం నితిన్ హీరోగా గతేడాది 'భీష్మ' సినిమా రూపొందించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే భీష్మ వచ్చి ఏడాది దాటినా వెంకీ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం.. వెంకీ వరుణ్ తేజ్ కు ఓ కథ వినిపించాడని తెలుస్తోంది. వెంకీ చెప్పిన కథ విని వరుణ్ తేజ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
వెంకీ కుడుముల తదుపరి చిత్రం ఈ హీరోతోనే అంటూ ఇప్పటికే ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఇటీవల 'ఉప్పెన'తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో వెంకీ తన నెక్స్ట్ మూవీ చేయనున్నాడని కూడా వార్తలొచ్చాయి. వైష్ణవ్ కి వెంకీ ఓ కథ వినిపించాడని, ఆ కథకి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్, వెంకీ కాంబినేషన్ లో మూవీ అంటూ న్యూస్ వినిపిస్తోంది. మరి వెంకీ ఈ ఇద్దరు మెగా హీరోలలో ఏ హీరోతో మూవీ చేస్తాడో లేదా మరెవరైనా హీరోతో చేస్తారో చూడాలి.