కరోనా కాలంలో ప్రజల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సోను సూద్ బయటనే కాదు, తను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సేవాభావం వదిలి పెట్టడం లేదు. తాను సంపాదిస్తున్న దానిలో అత్యధిక భాగం ప్రజల కోసమే వెచ్చిస్తున్నాడు. వాళ్లకు అవసరమైన వస్తువులను సమకూరుస్తున్నాడు. ఎలా వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కార్మికులను వాళ్ల ఇళ్లకు పంపిస్తున్నాడు. తాజాగా ఆయన తన ఇంటి బయట ఉన్న జనానికి, మీడియా ప్రతినిధులకు స్వయంగా సమ్మర్ సిరప్ అందిస్తూ కనిపించాడు.
వాస్తవానికి సోను సూద్ తన ఇంట్లో ఉండగా, బయట వేసవి వేడిలో నిల్చొని ఉన్న జనాన్ని చూశాడు. దాంతో ఇంట్లో ఏం చేయకుండా ఉండలేకపోయాడు. వేడి నుంచి జనానికి ఉపశమనం కలిగించడం కోసం అప్పటికప్పుడు తయారుచేసి, కిందకు వచ్చాడు. తన కార్యకర్తలతో కలిసి స్వయంగా అక్కడున్న జనానికి, మీడియా ప్రతినిధులకు గ్లాసులతో సిరప్ అందించాడు.
గత కొద్ది రోజులుగా చాలా మంది తదుపరి ప్రధాన మంత్రి సోను సూద్ అయితే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. రాఖీ సావంత్ సైత సోను సూద్ లాంటి వ్యక్తి ప్రధాని అయితే దేశానికి మేలు జరుగుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. "ఎన్నికల్లో నిలబడే ఆలోచన ఉందా?" అని మీడియా ప్రతినిధులు ఆయనను కోరారు. దానికి సోను ఇచ్చిన సమాధానం మన హృదయాల్ని స్పృశించక మానదు. "అది మన పని కాదు. ఇప్పుడు మీతో పాటు నిలబడే ఉన్నాను. ఇలా ఒక సాధారణ పౌరుడిగా ఉండటానికే నేను ఇష్టపడతాను." అని చెప్పాడు సోను.