'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఆగిపోయిందని కొద్దిరోజుల క్రితం న్యూస్ వినిపించింది. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ ఓ సినిమా చేయనున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య'తో నిరాశపరిచాడు చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాని చేస్తున్నాడు. అలాగే తన 16వ సినిమాని గౌతమ్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు కానీ ఆది ఆగిపోయిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు దర్శకత్వంలో చేసే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.
'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. తన రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే తన 30వ సినిమాని కొరటాల శివతో, 31 వ సినిమాని ప్రశాంత్ నీల్ తో ప్రకటించాడు. దానికితోడు పలు కారణాల వల్ల 'ఎన్టీఆర్ 30' ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు చాలా కాలం ఎదురుచూడక తప్పేలా లేదు. అందుకే ఆయన ఈలోపు మరో ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం చరణ్ తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.