![]() |
![]() |

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కి తెలుగు చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధమే ఉంది. అనిల్ పూర్తి స్థాయి పాత్రలో నటించిన తొలి సినిమా `వంశ వృక్షం` (1980).. ఓ తెలుగు చిత్రం కావడం గమనార్హం. అలాగే, హిందీలో ఆయన పలు తెలుగు చిత్రాల తాలూకు రీమేక్స్ చేసి విజయాలు అందుకున్నారు.
ఇదిలా ఉంటే, 42 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం అనిల్ కపూర్ ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లుగా కొన్నాళ్ళ క్రితం ప్రచారం జరిగింది. `అతడు`, `ఖలేజా` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న కొత్త సినిమాలో మహేశ్ కి తండ్రిగా అనిల్ కపూర్ కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అనిల్ కపూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడం దాదాపు ఖాయమేనట. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఆయన భారీగా పారితోషికం అందుకోబోతున్నారని టాక్. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ లో అనిల్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
![]() |
![]() |