ఓ మనిషీ !
నీవు మనిషిలా జన్మించి
పశువులా...
ఎందుకు ప్రవర్తిస్తున్నావు...?
"ఉన్మాదిలా" "పర్యావరణ "ఉగ్రవాదిలా"
ఎందుకు జీవిస్తున్నావు..?
నీ విలాసాలకోసం...
నీ వినోదాల కోసం...
నీ సుఖశాంతులకోసం...
ప్రకృతినెందుకు బలిచేస్తున్నావు..?
సకలజీవులకు ఆ సృష్టికర్త
ప్రసాదించిన పంచభూతాలైన
గాలి...నింగీ...నేల...నీరు...నిప్పు
సర్వం ఉచితమే కాలుష్య రహితమే
కానీ నీవు త్రాగే నీరు...నీవు తినే తిండి...
నీవు పీల్చే గాలి...నీకు వినిపించే శబ్దం...
నీవు వాడి పడేసే ప్లాస్టిక్ భూతంతో
నీ పర్యావరణం...కాలుష్యమైపోతోంది
ఆ ప్రకృతియే వికృత రూపం దాలిస్తే...
ఈ నేలపై "నరుని బ్రతుకు నరకమే".
ఓ మనిషీ ! ఈ కాలుష్యపు
విషపుకోరల్లో నీవు చిక్కుకుపోతే ...
"పులినోట" తలదూర్చినట్లే...
"నవనాగరికత" పేర
నీ "గోతిని" నీవు త్రవ్వుకున్నట్లే...
నీవు "కూర్చున్నకొమ్మను"
నీవు నవ్వుతూ నరుక్కున్నట్లే...
అందుకే ఓ మనిషీ !
నీ స్వార్థానికి...అంతులేని
నీ ఆశకు...నీ అత్యాశకు...
ఆ పంచభూతాలు...
భగ్గుమంటున్నాయి జాగ్రత్త!
ఓ దయగల దైవమా !
ఈ మతిలేని మనిషికి
ఈ జల...శబ్ద...వాయు...
వాతావరణ...కాలుష్యపు...
విషపు కోరలనుండి విముక్తి ఎప్పుడు?
మనిషి స్వార్థాన్ని విడనాడినప్పుడే...
ప్రకృతి ధర్మాలకు కట్టుబడినప్పుడే...
సకలజీవుల సంక్షేమాన్ని కాంక్షించినప్పుడే...
కాలుష్య నివారణే పర్యావరణ పరిరక్షణే...
తమ జీవితలక్ష్యమని...పంచభూతాల...
సాక్షిగా ప్రతిమనిషి ప్రమాణం చేసినప్పుడే...



