Facebook Twitter
శిల్పి చేతిలో శిలవా..? ఎవరు నీవు?

ఓ మానవా..!
నీవు శిల్పి చేతిలో శిలవా..?
పిచ్చివాని చేతిలో రాయివా..?
ఎవరు నీవు..? ముందు తేల్చుకో..!

ఓ మానవా..!
నీళ్ళలోఎంత కాలమున్నా
మెత్తపడని
"రాతి సందేశమేమిటో"తెలుసా?
స్థితప్రజ్ఞత గల మనిషి జీవితంలో
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా
నిన్న నేడు రేపు నిండుకుండలా...
నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడని...

ఎవరో కొండమీద నుండి తెచ్చిన
ఒక బండను రెండు ముక్కలు చేస్తే
ఒక ముక్క..."చాకిరేవుకు" చేరిందట
ఒక ముక్క చక్కని సుందర దేవతా
శిల్పమై........"గర్భగుడికి" చేరిందట
అర్చనలు అభిషేకాలందుకుందట...

ఆపై చాకి రేపుకు చేరిన
"మురికి బట్టలు" శుభ్రమయ్యాయట
కానీ గుడికి చేరిన
"మురికి మనుషులు" మాత్రం
మురికి మనసులతో ఇంటికి తిరిగెళ్ళారట
ఓ మానవా..!
ఏ ముక్క గొప్పదో ముందు తేల్చాలట...

తొక్కితే రాయట...మొక్కితే దైవమట...
ఇసుకపై...నీటిపై...వ్రాసిన వ్రాతలు
చెరిగిపోతాయట కనుమరుగై పోతాయట
కానీ "శిలలపై చెక్కిన అక్షరాలు"శాశ్వతమట

ఓ మానవా..!
నీ కఠినమైన మనసును మార్చుకోవా...
నీ కుటిల కుక్కబుద్ధిని శుద్ది చేసుకోవా...
నీలోని అరిషడ్వర్గాలను అంతంచేసుకోవా..
ఇకనైనా నీవు రాయివో...రాముడివో...
రాక్షసుడివో రక్షకుడివో ముందు తేల్చుకోవా