మీకో మాట చెప్పాలని వుంది...( పార్ట్ - 2)
మీరు "విడిపోండి విడిపోండి"
అనేవారి మాయమాటల వలలో...
ఉచిత సలహాల ఊబిలో చిక్కుకోరాదని...
"కలిసి వుండండి కలిసి ఉండండి"
కలిసివుంటే కలదు సుఖమునే
వారికాళ్లకు మ్రొక్కమని...
ఓ నూతన వధూవరులారా !
మీకోమాట చెప్పాలని వుంది !
మీరు సుఖసంతోషాల
రెక్కలు కట్టుకుని
జీవితపు వినువీధిలో
విహంగాలై విహరించాలని...
మీరు ఒకరిపై ఒకరు
ప్రశంసల "పూలగుత్తులు"
విసురుకొని పులకించి పోవాలని...
విషం చిమ్ముకొని "విడాకుల కత్తులు"
విసురు కోరాదని...విడిపోరాదని...
ఓ నూతన వధూవరులారా !
మీకోమాట చెప్పాలని వుంది !
పడిపోయినా...పైకి లేవాలని
చెడిపోయినా...బాగుపడాలని
విడిపోయినా...కలిసి ఉండాలని
దూరమైపోయినా... దగ్గరవ్వాలని
మీరు "చిలకా గోరింకలై"
చెరగని చిరునవ్వులతో
చిరకాలం జీవించాలని...
ఓ నూతన వధూవరులారా !
మీకోమాట చెప్పాలని వుంది!



