ఈ రేయి ఎంతో తీయనైనది
నువ్వంటే నాకెంతో
ఇష్టమని ముందుకు వంగి
నా నుదుటిని ముద్దాడితే
నా ముంగురులు మురిశాయి
ఎదపై ప్రేమలతలు మొలిచాయి
కన్నుల్లో వెన్నెల వానలు కురిశాయి
గుండెల్లో గుసగుసలు...
తనువంతా తపించిపోతోంది
ఒంపుసొంపులు ఒలకబోస్తోంది
సెగలు పొగలతో వగలు పోతోంది
పడక పకపకా నవ్వుతుంది
బెడ్లైట్ గుడ్నైట్ చెబుతుంది
దిండు దిగులుగా చూస్తుంది
ఎదలో ఏదో తెలియని అలజడి...
స్వర్గ లోకాలలో విహరించాలనే
తీయనికలలు మేఘాల్లో మెరుపులై
తనువులు రెండు తగవులాడగ
వేకువజాము వెక్కిరిస్తోంది
చీకటి చిరునవ్వు నవ్వుతుంది
చిగురించిన ఓ కొత్తకోరిక ఏదో
సుఖాల సుప్రభాతం పాడుతుంది
తీపిజ్ఞాపకాలెన్నో సుందర దేవతాశిల్పాలాయె
గుండెగూటిలో దాగి గుసగులాడె గువ్వలాయె
ఔను ఈ రేయి ఎంతో తీయనైనది తేనెపట్టులా
మరిచిపోలేని...మరపురాని...
మధురజ్ఞాపకంలా



