భగభగమండే సూర్యుని చెంతకు చేరి
భస్మమైపోకుండ మంత్రించి ఓ యంత్రాన్నే
పంపించి సూర్యదేవుని గుట్టంతా రట్టుచేశావే !
ఓ మానవుడా ! నీ వెంతటి మహనీయుడవయ్యా !
ఆకాశహార్మ్యాలతో సుందర నగరాలు
తరతరాలకు చెక్కుచెదరని సుందరశిల్పాలతో
కళ్ళు తిరిగే గుళ్ళుగోపురాలు నిర్మిస్తున్నావే !
ఓ మానవుడా ! నీ వెంతటి మహోన్నతుడివయ్యా!
క్లోనింగ్ లతో టెస్టు ట్యూబ్ బేబీలతో
గుండెమార్పిళ్ళతో సృష్టికే ప్రతిసృష్టి చేస్తున్నావే !
అంతర్యామినే ఆశ్చర్యచకితున్ని చేస్తున్నావే !
ఓ మానవుడా ! నీ వెంతటి మహిమాన్వితుడివయ్యా
ఆ నీలినింగిలో విహంగంలా విహరిస్తున్నావే !
రాకెట్లతో ఎగిరి అంతరిక్షం అంతుచూస్తున్నావే !
అంతుదొరకని సృష్టిరహస్యాలను వెలికితీస్తున్నావే !
ఓ మానవుడా ! నీ వెంతటి మహాత్ముడివయ్యా !
ప్రకృతి ప్రకోపించి కుంభవృష్టిని మంచుతుఫాన్లను
సునామీలను భూకంపాలను సృష్టించినా
అగ్నిపర్వతాలు బ్రద్దలై లావాను విరజిమ్మినా
చింతయేలేక చిరునవ్వుతో
చిందులు వేస్తున్నావే !
ఓ మానవుడా ! నీ వెంతటి స్థితప్రజ్ఞుడివయ్యా !
మహత్తర ప్రయోగాలతో
మందులు టీకాలు కనిపెట్టి
ఆయుష్షును పెంచుకొని అమరత్వాన్నాశిస్తున్నావే !
మృత్యుశాసనం లిఖిస్తూ
మృత్యువునే శాసిస్తున్నావే !
ఓ మానవుడా ! నీ వెంతటి మృత్యుంజయుడివయ్యా !



