Facebook Twitter
బ్రతుకు జట్కాబండి…

ఆకలేసి
గుప్పెడు
గింజలకోసం
గూడు విడిచి
ఎక్కడికెక్కడికో
పక్షులగుంపులు
ఎగిరిపోయినట్లు

దాహం వేసిన
జంతువులు
ఎర్రని ఎండలో
వాగులు వంకలు
చెరువులు చెలిమలు
వెదుకుక్కుంటూ
వెళ్ళిపోయినట్లు

రెక్కలొచ్చిన పక్షులు
వినువీధిలో విహంగాలై
స్వేచ్ఛగా విహరించినట్టు

వయసొచ్చిన బిడ్డలు
ఉన్నఊరును కన్నవారిని
వదిలేసి ఉన్నతవిద్యంటూ
ఐదంకెల ఉద్యోగాలవేటలో
వేలమైళ్ళదూరాలకెళ్ళిపోయి
భార్యాబిడ్డలకు దూరంగా బ్రతుకుతారు

ఆపై విధిలేక బండలైన బంధాలతో
సహనంతో సర్దుబాటుగుణంతో
రద్దైన రక్తసంబధాలతో రాజీపడడమే

మిణుకు మిణుకుమనే ఆవగింజంత ఆశతో
ముఖాలపై నకిలీ నవ్వుల్ని ముద్రించుకోవడమే
చిమ్మచీకటిలో ఏకాంతంగా ఏడుస్తూ ఉండడమే
భారమైనా బ్రతుకు బండినీ ఈడుస్తూ పోవడమే
బాధతో బరువెక్కిన గుండెల్ని ‌భరిస్తూ పోవడమే
భారమంతా భగవంతునిపైవేసి భయంతో బ్రతకడమే