Facebook Twitter
నిన్న నిద్దుర పోని నేడు నిద్దుర రాని ఆ ఇద్దరు?

కమ్మని కలలు కంటూ కలిశారు
పేగు తెంచుకుని
రక్తాన్ని పంచుకొని పుట్టిన
ముద్దులొలికే పిల్లలను చూసి
మురిసిపోయారు

పేరు పెట్టారు పాలు పట్టారు
ప్రేమతో పెంచారు
కడుపు మాడ్చుకున్నారు
కష్టాలు పడ్డారు కన్నీరు కార్చారు
రాత్రింబవళ్ళు రక్తాన్ని స్వేదంగా మార్చారు

అప్పులు చేశారు అవమానాలపాలయ్యారు
పెద్ద చదువులు చదివించారు
కల్తీలేని స్వచ్చమైన ప్రేమను పంచారు
గాడిదచాకిరి చేశారు ఘనంగా వివాహాలు
జరిపించారు

పిల్లల శ్రేయస్సు కోసమే ఈ బ్రతుకులంటూ
ప్రతిక్షణం తపించారు

ఇలా మీ సుఖసంతోషాల కోసమే
ఇన్ని కలలు కని
ఇంతగా శ్రమించిన, ప్రేమించిన,
చేసిన తప్పుల్ని క్షమించిన
రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసిన
ముసలితల్లిదండ్రులను 
కుక్కలకన్న హీనంగా చూసినవారు కాదు
అనాధాశ్రమంలో చేర్చినవారు కాదు

చేర్చి
ఇంటికి దూరంగా ఒంటరిగా వుంచి
రెక్కలు తెగిన పక్షులుగా,
దిక్కులేని అనాధలుగా,
ఆకలికి అలమటించే అస్థిపంజరాలుగా  మార్చినవారు కాదు

పాలు త్రాగి పెరిగిన వారు
చేసిన మేలు మరువని వారు
కన్నతల్లీ దండ్రుల ఋణం తీర్చినవారే
కన్నవారి కష్టాలు చూసి కన్నీరు కార్చినవారే
నిజమైన మనసున్న మానవత్వమున్న మనుషులు