యుక్తవయసులో తీయని కలలుకంటారు
ఒక ఆస్తిపరుడైన భర్త దొరకాలని
ఒక అందమైన భార్య రావాలని
పెళ్లై భార్యభర్తలైన తర్వాత
ఒక కొత్త జంటగా కమ్మని కలలు కంటారు
ఓ చక్కని బాబో ఓ అందమైన పాపో పుట్టాలని
ఆపై తల్లిదండ్రులైన తర్వాత
తిరిగి తీయని కలలుకంటారు
కన్నబిడ్డలు అమెరికాలో ఖరీదైన
చదువులు చదవాలని,
కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని
అందరికన్న ఉన్నతమైనస్థితిలో ఉండాలని
కానీ వృద్ధులైన తల్లిదండ్రులను
గురించి ఎటువంటిశ్రద్ధ తీసుకోరు
వారి బాగోగుల గురించి కన్నబిడ్డలు
కలలేమీ కనరు,కారణం ఒక్కటే
నిన్నవారిపై వున్న ప్రేమ నేడు సన్నగిల్లడం
రక్తసంబంధాలన్నీ రచ్చబండలైపోవడం
బందాలు అనుబంధాలన్నీ ఆవిరైపోవడం
కంటిచూపు మందగించి, కాళ్లలోసత్తువలేక
కర్ర ఆధారంతో నడిచే కన్నవారిని
అనాధ ఆశ్రమాలలో చేర్చి వారిని
రెక్కలు తెగిన పక్షులుగా,
దిక్కులేని అనాధలుగా,
ఆకలికి అలమటించే అస్థిపంజరాలుగా మార్చేకన్న
కారడవిలో వదిలివేసినా కాస్త మేలు కదా
జంతువులకాహారమైనా వారిజన్మధన్యమే గదా
వృద్ధులైన తల్లిదండ్రులు, కోరేదేమిటి?
పగలు రాత్రి తపించేది దేనికోసం?
పెద్దరికం కోసమా కాదే
ప్రేమపూర్వకమైన పిల్లల తియ్యనిపిలుపు కోసమేగా
మాయరోగం ముదిరి మంచాన పడితే
ఆశతో ఎదురుచూసేది
మనసులో మధనపడేది దేనికోసం?
పిడికెడు మెతుకుల కోసమా? కాదే
మరణాన్ని దూరంచేసే మందుల కోసమేగా
కష్టపడి, శ్రమటోడ్చి, రక్తంధార బోసి
ఆర్జించిన ఆస్తినంతా పిల్లలపేర వ్రాసి
దరిద్రులైన వారిని ధనవంతులను చేసి
వారుమాత్రం నీడలేని నిరుపేదలౌతారే,
అట్టి తల్లిదండ్రులనా మీరు
అనాధాశ్రమంలో చేర్చేది ?
అట్టి కన్నవారినా మీరు
ఇంటికి దూరంగా ఒంటరిగా వుంచి అస్థిపంజరాలుగా మార్చేది?
ఎంతవరకిది సమంజసమో,మీరే ఆలోచించండి?
మిత్రులారా! కన్నబిడ్డలారా!!, ఖటినాత్ములారా!!!



