Facebook Twitter
ఆలోచన.. ఆచరణ (చందమామ కథ)

ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా  తన వంతు సేవ చేసేవాడు.
ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రాగమానికీ ఏటిగట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు.
అందువల్ల కాలువపైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయితీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. పోనీ గ్రామస్థులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. అందువల్ల అరవిందుడు తన స్వంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు.
 
దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెలనెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయితీ అంగీకరించింది. కాలువ దాటడానికి తాటిచెక్క వంతెన పోయి, బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు.
అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. “కాలువపైన వంతెన నిర్మించక, బల్లకట్టు వేస్తే సరిపోతుందా? దానిని నడిపే వాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయితీ నిధులు దండుగే కదా!” అంటూ విమర్శించాడు. ఆ మాట అరవిందుడి చెవికి చేరినా ఏమీ అనలేదు.
ఓసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగూరికి బయలుదేరాడు. ఏటి ఒడ్డమ్మట వెళ్తూంటే, దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరివాళ్లు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరుగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కమ్చీ కోలతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు.
 
అది చూసిన నాగేంద్ర “ఎడ్లను కొట్టి పని చేయించడమూ ఓ గొప్పేనా! వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి,”" అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర... అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలేదు.
మరికొంత దూరం వెళ్లేసరికి ఎడ్లు నత్త నడకన నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో “నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది. నేను వెనక కూర్చుంటాను. నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు” అన్నాడు.
నాగేంద్ర ఉలికిపడి, “బండి నడపడం నాకు చేతకాదు.” అన్నాడు కంగారుగా.
“ఎడ్డను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసినవాడివి, బండి నడపలేవా?” అన్నాడు అరవిందుడు అచ్చెరపాటుతో.
“దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపటం అందరికీ చేతనౌతుందా?” అన్నాడు నాగేంద్ర.
అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు. “ఓ మంచి పని చేయాలన్న ఆలోచనా, ఎలా చేయాలన్న ఊహా అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతాను. ఆలోచన వేరు, ఆచరణ వేరూను. నీటిలో దిగితే కాని లోతు తెలవనట్లే, ఓ పనిని ఆచరిస్తే కాని అందులోని సాధకబాధకాలు తెలిసిరావు. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే. ఆ పనిని స్వయంగా చేయడమే కష్టం.. విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి. వాటివల్ల ఓ మంచిపని చేయాలనుకునే వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది.”
అరవిందుడు తన పారపాటును సున్నితంగా ఎత్తిచూపడంతో, నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక, ఇతరులు చేసే మంచిపనులకు తన వంతు సాయం చేయనారంభించాడు.