.webp)
అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు.
స్నేహితులంతా ఏమిటి వనమయ్యా నీవేమీ మాట్లాడడం లేదు.నీవేమీ ఘనకార్యం చెయ్యలేవా?అని ఎగతాళిగా అడిగారు. అప్పుడు వనమయ్య నేనేదయినా చేయగలను.ఏమి చేయ్యమంటారో చెప్పండి చేసి చూపిస్తాను.అన్నాడు.
అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి వుండాలి.ఏ విధంగానూ వేడి తగలరాదు.పొద్దు పొడిచేవరకూ అలాగే నిలబడి వుండాలి.అని హెచ్చరించారు.
సరే అలాగే నిలబడతాను.నేను ఓడిపోతే మీ కందరికీ విందు భోజనం పెట్టిస్తాను.అదీ పందెం.అన్నాడు వనమయ్య.
ఇంట్లో కుంపటి,దీపం ఆర్పేసి బయటకు వెళ్లి నిలుచున్నాడు.అర్ధరాత్రి అయ్యే సరికి చలి బాగా ఎక్కువైంది మంచు కురవడం ప్రారంభ మైంది.పళ్ళు గిట్ట కరుచుకుని పోయాయి. అటూ యిటూ పచారు చేయటం మొదులు పెట్టాడు..యింతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ వుంటే కొంచెం చలి తగ్గినట్లని పించింది.ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది.
స్నేహితులు వచ్చి మొత్తానికి గెలిచావయ్యా అని అభినందించారు.నీ కడుపు బంగారం గానూ!ఎలా ఓర్చుకున్నావయ్యా? అని అడిగారు.అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది. దాని వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను.అన్నాడు వనమయ్య.
ఏ విధమైన వేడీ వుండకూడదు అని చెప్పాము కదా! నీవు ఆ వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు వోడిపోయినట్టే.నీవు విందు ఇవ్వాల్సిందే అని అందరూ పట్టు బట్టారు.
ఎక్కడో దూరంగా వుండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది?యిది అన్యాయం అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు.విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టు బట్టారు.వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు.
ఏమి చెయ్యాలో దిక్కుతోచక న్యాయాధికారి దగ్గరికి వెళ్లి కథంతా చెప్పి నన్నేలాగైనా కాపాడండి అని వేడుకున్నాడు.ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చెయ్యమని చెప్పి పంపించాడు.
సరే నని యింటికి వెళ్లి మరుదినం ఒక కుండ లో బియ్యము నీళ్ళు పోసి చూరుకు వ్రేలాడ దీసి కింద చిన్నదీపం వెలిగించి పెట్టాడు.మధ్య మధ్యలో ఒక చిన్నబల్ల మీద ఎక్కి వుడి కిందా లేదా అని చూస్తున్నాడు.మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు.
వంట అయిందా వనమయ్యా? అని అడిగారు. యిదిగో యింకా ఉడుకు పట్టలేదు. పొద్దుననగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలి వచ్చి చూసి యిలా పెడితే ఎలావుడుకుతుంది? నీకేమైనా పిచ్చా? అన్నారు.స్నేహితులు.
దీపం చిన్నదైనా,ఎంతదూరంగా వున్నా వేడి తగులుతుందని అన్నారు గదా మీరంతా మరి యిదీ అంతే అన్నాడు వనమయ్య. వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ యింటి కి వెళ్లి వనమయ్యకు ఘనంగా విందు యిప్పించారు.



