చదువుకోవాలేమో (కవిత)

  చదువుకోవాలేమో పెళపెళలాడే ఎదుటి మనిషి లోలోతుల మనసుపుటల చప్పుడు ఎప్పుడూ వినబడుతూనే ఉంది దాంట్లో ఉన్నదేదో అతను చదివి చెప్పేది అబద్దమని తన మందహాసపు మంద్రపు సంతకమే హామీ అన్నట్లు చెప్పిన మాటలను నమ్మే నిరక్ష్యరాస్యుడినే నేను లిపులు వేరోమో ప్రతొక్కడి మనోపుట భావమొకటే పక్కకి తిరిగి వెక్కిరింపుల చప్పుళ్లకు విరిగిన పాళీ మోత తప్పుళ్లని గుర్తించడానికి నేను కూడా చదువుకోవాలేమో నాలోని నన్ను పూర్తిగా పూరించుకోని ఖాళీ ప్రశ్నలను ఆర్తిగా చదువుకోవాలేమో జగమంత కుటుంబమనే విశ్వ విద్యాలయంలో ఘనమని వేసిన పూమాలలు ఎండటానికి ఎక్కువ సేపు పట్టదనే విషయ సూచిక తో మొదలెట్టి చదువుకోవాలేమో లోకపు అక్షరాలను లోహపు గుండెలనుంచి సంగ్రహించి లోలోపలి పేరాలను ఆరాల నిగ్రహాలపై చదువుకోవాలేమో!!!!!!   - Raghualla

జనని ( గణతంత్ర దినోత్సవం స్పెషల్)

  జనని ( గణతంత్ర దినోత్సవం స్పెషల్))     కలం    కదిపి  గళం విప్పి  పాడనా  నా  తల్లి  మధుర కావ్య  కథలు  తరతరాల మధురిమల యశో చంద్ర సుధలు                            || పాడనా || ఆర్య భట్టుని 'శూన్య' మయినా అంతు పట్టని  శూన్య సిద్ధాంత మయినా అమ్మ జ్ఞాన ఖని, ఈ కరణి ఆమె  కెవరు  సాటి ఈ ధరణి ?                                                  || పాడనా || అవని లోన అంకెలకు  జనని  , నా జనని  పెక్కు భాషల పెద్దమ్మ కే  అమ్మ  , మా యమ్మ సంస్కృతీ, నాగరికతలకు  ఆమె పట్టుగొమ్మ సుశ్రావ్య స్వరాల, సుందర నృత్యాల  తరగని గని , ఈ పావని  || పాడనా || గణ తంత్ర రాజ్యాలు, గణితేతిహాసాలు గణనీయ   సాహితీ సౌరభ ప్రభాసాలు గత వైభవాల గగన ప్రాభవాలు                                                 || పాడనా || సింధులోన విరిసి, గంగ పైన  మెరిసి కృష్ణ  కావేరి ల తడిసి, హిందూ సగరమున మురిసి హిమోత్తుంగత్తుంగాల కెగసి , కాశ్మీరమున కురిసి విలసిల్లు   నా తల్లి  విశాల  భరత  వర్షి                                    || పాడనా || -   ప్రతాప్

నేను (కవిత)

నేను   ఉదయం తలుపు తెరవగానే నవ్వుతూ పలకరించిన గులాబీల్లో నా పసితనాన్ని మళ్ళీ ఎపుడైనా వెతుక్కున్నానా? నాకేం ఇష్టం? తెంపినా సంపూర్ణంగా నవ్వుతున్న పూలలోని అమాయకత్వం ఇష్టం సూరుమీంచి జారుతున్న చినుకుల్లో చినుకునై కరిగిపోవటం ఇష్టం గాలి గొంతుకై స్వరాన్ని ఆలపిస్తున్నపుడు హృదయం వింటుంటే తరించటం ఇష్టం నేను నా నుంచి దూరమై ఎన్నాళ్ళయింది? కల్మషం లేని నవ్వుని చూసి ఎపుడైనా తృప్తి పడుతున్నానా? తింటున్నపుడు రుచి మనసుకు నచ్చటం ఈ మధ్యకాలంలో ఫీలయ్యానా? నేను నాలా ఉండటం మానేసి ఎంతకాలమైంది? ఏమో .. నాకు నేనే లేనపుడు అసలు ప్రపంచంతో ఒరిగిందేమిటి చెప్పు. (నీ మనసులో నువ్వే లేనపుడు ఇంకెన్ని ఉన్నా వృథానే కదూ! Be you) ....... సరిత భూపతి

(శ్రీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా) అన్న కు నివాళి

అన్నకు నివాళి  (జనవరి 18 న శ్రీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా)     అందని  అంబరాల కరిగిన అన్నా! ఓ నందమూరి !! అందరి   మా వందనం అందంద ప్రేమ మీరి  అదిగదిగో కదలి వచ్చె,  ఆవేదన పంచుకున్న అన్ననే మన వైపు తెచ్చె మసి పట్టిన మన జాతిని, కలసి కట్టి, వెన్ను దట్టి,  పోరాడగా వెలుగు నిచ్చె కొట్టాడే   కొన ఊపిరి, అట్టడిగిన ఆత్మ గౌరవం , సడలిన స్వాభిమానం చేయి పట్టి , భుజం పెట్టి ,తెనుగు జాతి రీతి మార్చి , చూపెట్టెను  తేజో పథం  చిచ్చర పిడుగుల అడుగుల చీకటినే తిప్పి కొట్టి, పూరించెను సమర శంఖం, శృంఖలాలె  తెంచి, విజయం సాధించి, అమరుడైన  మా అన్నది - ఆ చైతన్య   రథం ఆకలి తో అలమటించు అన్నార్తుల కగ్గువ   బియ్యం మల , మలలాడే విద్యార్థుల కు మధ్యాహ్నపు భోజనం అనాది గా  అణగారిన ఆడ పడుచుల కాస్తి హక్కు సంసారాలే సమసిన   సారాయికి,  నిషేధమే మంచి నొక్కు అడ పొడ లేని,  అడలిన  విపక్షాల కట్టి కూర్చె 'జాతీయ వేదిక'  సంగరంగ    తల్లడిల్లు సోదరులు తమిళుల దప్పి దీర్చె  జాతి ఘనత పెంచి  తెలుగు గంగ అంతలింతలు కాదు తెలుగు దేశం నేలు  నీవు చేసిన మేలు, పచ్చంగా మా మది పదిలింగ మెదులు నది  పది కాలాలు                                                                                                      కరకు బోయడె కాదు , కరుణార్ద్ర కృతికర్త ఆది కవి యతడు వీర బ్రహ్మేంద్రుడు , విజిత బ్రహ్మ నాయుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు సతిని కోలుపడి పరమేశ్వరుడు ,  శ్రీనాథుడు - సరస శృంగార ప్రబంధ పరమేశ్వరుడు రోషమే రంగరించిన రంగరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణ రాయలు  ఉత్తర కొమరికి అమరిన  మహత్తర నృత్య బుధుడు  పేడి బృహన్నలుడు ఉత్తర గోగ్రహణ సమరాన మహోత్తర శస్త్ర కోవిదుడు విజయు డర్జునుడు కులసతికి  బాసట గ కుప్పించి ఎగసి,  బాస బూనిన కొదమ సింగం వాడు కుంతీ మధ్యముడు భీమసేనుడు   శత సోదర శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణుడు, అభిమాన ధనుడు సుయోధనుడు  కైలాస మే కదలి  వడుక గా,  హిమోత్తుంగ   నగమే నడుక గా రుధిరమ్ము పొంగించి ,  రౌద్ర వీణా రవమున,    రప్పించి రుద్రు రయమున ,  మెప్పించె అకలంక జంగ మేశ్వరుడు లంకేశ్వరుడు ఇలను ధర్మము గఱపి ,   ఇన కులాన్వయ కీర్తి నిల్పి  జన మనోభిరాముడు  శ్రీరాముడు  నిగమాగమ కర్త , సకల  భువన భర్త , భక్తి , రక్తి భోక్త  , వేద గీత వక్త శ్రీ కృష్ణ భగవానుడు నట విరాట్టుగ నీ  విశ్వరూపం , నచ్చి, వచ్చి, మెచ్చి జనత సల్పె  వంది , నీరాజనం  కళ్ళకు కట్టినట్టు , గత మంతా మతికొస్తే , గట్టిగ ఒళ్ళంతా  తెలియని  గగుర్పాటు ఇక మీదట తీరే దెటు, నిద్ర లేపి బాట చూపిన , నీవు లేని ఆ లోటు   ఎందైనా , ఎపుడైనా ,  మా ఎదలో నీకె గదా  నిండైన  ఆ చోటు కను మరుగై, ఎగిరి నీవు గగనాల కరిగినా , ఎరిగి మాకు అన్నా!  నటుడి గా , నాయకుడి గా నీకు  నీవే దీటు  అందుకో అన్నా! నందమూరి!! ఇందు  మా నివాళి ఎందున్నా నీకె  చెందు ఎల్ల తెనుగు మానవాళి -   ప్రతాప్

ఎన్నో వసంతాల తరువాత (కవిత)

ఎన్నో వసంతాల తరువాత     ఎన్నో వసంతాల తరువాత.... మనసులోని బావాలు అలలు గా ఎగిసి పడుతుంటే... గండి తెగిన గుండెలోని వేదనలు కంటి పాపను తడుపుతుంటే... నిస్సత్తువతో కొవ్వొత్తిలా కరిగిపోతున్న ఆనందపు వెలుగు మారుతుంటే... చేతిలోని కలం....మనసులోని బావం...ఉరకలు వేస్తానంటుంటే..... ఆగ లేక...ఆప లేక...ఈ ప్రేమ లేఖ మొదలు పెట్టాను....... తొలి పలుకులు...తొలకరి జల్లుల ఇసుకతిన్నేలో నీ అడుగులలో నా అడుగులు.. అడుగడుగునా... హ్రుదినిండా ఆ మధురమైన జ్ఞాపకాలు...... నీవే నా నెల రాజువని...నను వీడని నా నీడవని... అనుక్షణం వీడని నా తలపుల మది ఆలోచనల చిరు సవ్వడివని.... క్షణమైనా వీడని నా తలపుల జాడవు నీవు.... నీ మనోహర రూపం కోసం ఎదురు చూసే నా కంటి పాపల ఆశవు నీవు... ఆనాటి నీ ప్రేమ లేఖలు...ఈ నాటికి అవి మధురమైన స్మృతులు... నీవే తెలిపే ఆ ప్రేమ ఊసులు...మనసుని తట్టి లేపే అనుబూతులు... రావేమి, రా ఏమి? రమణీయమైన ఆ మధుర క్షణాలు... మనసు మాటలు...కనుల ఊసులు...కన్న కలలు... ప్రణయ ప్రకృతితో ...నీలి మేఘాలతో...హోయలోకించే జలపాతాలతో..గుడి గంటలతో...జడి వానతో నీవు చెప్పిన నీ ప్రేయసి కావ్యం...ఇప్పటికి నా మది పులకించే శ్రావ్యం... ఎప్పటికప్పుడు...నీ ఎద చప్పుడు తెలిపే ఆ లేఖ....ఇపుడు లేక ఆగ లేక మనసులోనే దాచేస్తున్నాను ఈ ప్రేమ లేఖ నీకు పంప లేక... ...Sudharani Challa

నువ్వు మారిపోయావ్ (కవిత)

  నువ్వు మారిపోయావ్ ఆ వెన్నెల్లో ఒకరి నవ్వుల్లో ఒకరం ఇంకిపోవటం.. నిశీధి అంచుల్లో నడుస్తూ చెప్పలేక చెప్పుకున్న వీడ్కోళ్ళేవీ నీకు గుర్తుండి ఉండవు.. చిన్న స్పర్శలోనే మౌనాన్ని కూడా మనసుతో చదివిన నువ్వు ఇపుడు కళ్ళడిగే ప్రశ్నలను గుర్తించలేవు ధారాళంగా కురిసి ఎండిపోయిన మనసును తడుపుతూ ఆత్మీయంగా ఇంత వ్యధయేమని కూడా అడగలేవు సాగరమంత శూన్యంలో నిన్ను వెతికి పట్టుకున్నపుడు కొట్టుకుపోయినా వదిలిపోలేని నీటిబొట్టునే మాటల తూటాలు చీల్చివేస్తున్నా బంధమనే ఆయుధమెపుడూ మనసుకు కుట్లేస్తూనే ఉంటుంది అది జీవితాన్నే పెకిలించివేసినపుడు నెత్తురోడిన గుండెల్లో మిగిలేది శూన్యం కాక మరేమిటి?   ----- సరిత భూపతి

ఆ నవ్వులు నన్ను చంపేస్తున్నాయి...!!

ఆ నవ్వులు నన్ను చంపేస్తున్నాయి...!!     నీకు గుర్తుందా నా పుట్టిన రోజు ఎప్పుడని నీకు గుర్తుందా నీ కోసమే మీ ఊరికి వచ్చేదానినని బయటి వాళ్ళ పుట్టిన రోజు గుర్తుపెట్టుకోని మరి విష్ చేస్తావ్ నన్ను మాత్రం పరాయిదానిలా చూస్తావ్..... అవునులే గుర్తుపెట్టుకోవడానికి ఇపుడు నేను నీకేమి కానుగా కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు కలిశారుగా ఇక నేనెక్కడ నీకు గుర్తోస్తాను కదా.... నీకు తెలుసా నీతో ఎందుకు గొడవ పడతానని కనీసం గొడవ పడుతూ అయినా కాసేపు నాతో మాట్లాడతవని నీకు తెలుసా నా పుట్టిన రోజుకి నీ కాల్ కోసం ఎంత ఎదురు చూశానని అపుడైనా నాతో ప్రేమగా మాట్లాడతవని..... నా మీద కోపముంటే కొట్టు భరిస్తాను నన్ను తిట్టాలనిపిస్తే తిట్టు తట్టుకుంటాను కానీ ఇలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను మోసంచేయకు ఎందుకంటే నీతో ఉన్నవాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు నువ్వు చేసిన గాయం కంటే..... ఆ నవ్వులు నన్ను మానసికంగా చంపేస్తున్నాయి...!!   Courtesy..

ఎదురుచూపు (కవిత)

    ఎదురుచూపు     అటుగా వెళ్తున్న  నీవు ఒక సారైన నా వైపు తొంగి చూస్తావని..... వెన్నెల కాంతి లొ నీ ప్రతిబింబాన్ని నీటిలొ నైనా నే చూడగలనని..... రేయి అంతా పెరటిబావి చెట్టు క్రింద కూర్చొని నీలి ఆకాశం లో ఉన్న రేరాజు ని చూస్తూ ఉండిపొయా! అంతా నన్నే చూస్తున్నారు... హేళనగా  నవ్వుతున్నారు.... మాటల కత్తులు విసురుతూనే ఉన్నారు..... కాని నా మది ఈ ప్రపంచపు కట్టు బాట్ల బరి దాటి అనంత విశ్వపు స్వేచ్చా విహంగమై అలౌకిక అమలిన  ముకుళితనై నీ బాహు పరిష్వంగమై మురిసిపొతున్నానని వారికేం తెలుసు... ఆరాధించడం మాత్రమే తెలిసిన పిచ్చి ప్రేమికనని ..... అనురాగాన్ని మాత్రమే నింపుకున్న నీ ఆరో ప్రాణాన్నని.......వారికేం తెలుసు! ......Poetry Sudha Challa