చదువుకోవాలేమో (కవిత)
posted on Jan 27, 2016
చదువుకోవాలేమో
పెళపెళలాడే ఎదుటి మనిషి లోలోతుల మనసుపుటల చప్పుడు ఎప్పుడూ వినబడుతూనే ఉంది
దాంట్లో ఉన్నదేదో అతను చదివి చెప్పేది అబద్దమని
తన మందహాసపు మంద్రపు సంతకమే హామీ అన్నట్లు చెప్పిన మాటలను నమ్మే నిరక్ష్యరాస్యుడినే నేను
లిపులు వేరోమో
ప్రతొక్కడి మనోపుట భావమొకటే
పక్కకి తిరిగి వెక్కిరింపుల చప్పుళ్లకు
విరిగిన పాళీ మోత తప్పుళ్లని
గుర్తించడానికి నేను కూడా చదువుకోవాలేమో
నాలోని నన్ను పూర్తిగా
పూరించుకోని ఖాళీ ప్రశ్నలను ఆర్తిగా
చదువుకోవాలేమో
జగమంత కుటుంబమనే విశ్వ విద్యాలయంలో
ఘనమని వేసిన పూమాలలు
ఎండటానికి ఎక్కువ సేపు పట్టదనే
విషయ సూచిక తో మొదలెట్టి
చదువుకోవాలేమో
లోకపు అక్షరాలను
లోహపు గుండెలనుంచి సంగ్రహించి
లోలోపలి పేరాలను ఆరాల నిగ్రహాలపై
చదువుకోవాలేమో!!!!!!
- Raghualla