సర్వే దేవుళ్ళు!!

సర్వే దేవుళ్ళు!! ఓటరు దేవుళ్ళు  భక్తులైన బరిలోని అభ్యర్థుల  వాగ్దానాల దీపధూపాలో  పథకాల పప్పుబెల్లాలో   అమ్యామ్యాల లిక్కరు తీర్థమో  చదివింపుల రొక్కపు నైవేద్యమో మైమరచి పుచ్చేసుకొని చూపుడువేలితో గెలుపురాతనిచ్చి ఫలితాన్ని పండుగరోజుకై దాచేస్తే!! ఆరోజుకై ఆగలేని భక్తులు ఆత్రంతో నరాలు తెంచుకొంటూ గెలుపోటములను ఊహిస్తూ పందాలుకాసే  జూదరులకోసం కొత్తదేవుళ్ళొచ్చారు! ఓటరుదేవుళ్లతో సత్సంబంధాలున్నాయనీ  ఇచ్చేసిన వరాలగుట్టు మాదగ్గరుందనీ వివరాలు ఇవేనని గుట్టునిప్పేస్తూ అభయహస్తాన్నిస్తూ సర్వేదేవుళ్లు! నమ్మి సర్వస్వమూ పందెంలోపెట్టి నెత్తిన భస్మాసురహస్తం పెట్టించుకొని  బ్రతుకుల్ని బజారుకీడ్చుకొంటూ సర్వేదేవుళ్లకు బలవుతూ పందెంరాయుళ్లు గెలుపుభ్రమలోబడి అభ్యర్థులు వారి భక్తులు! - రవి కిషొర్ పెంట్రాల

ఓటుహక్కు!!

ఓటుహక్కు!! ప్రజల సమూహం సమాజం  సైన్యం సమస్తం నేనే  మహాద్భుతమైన పనులనెన్నో  ప్రపంచంలో చేసిందీ నేనే! పొలాల్లో పంటలు పండించిందీ  ఫ్యాక్టరీల్లో చెమట చిందించిందీ నేనే కూడూ గుడ్డా గూడూ నీడా  మేడా మోటారు సృష్టించిందీ నేనే! శ్రమశక్తిని నిలువెల్లా దోపిడీజేసినా  ఎదిరించలేక బెదిరిందీ నేనే భయంకర తుఫానులెన్నో మీదపడినా  పీడకలలనుకోని మరిచిందీ నేనే!  అప్పుడప్పుడు అసహనం  అరకొరగా అక్కడక్కడా చూపిందీ నేనే  హక్కులకై పోరాడిన వీరుల పోరుకు భుజందట్టి పంపిందీ నేనే! వార్తమానపు ప్రస్తుతంలో  గతచరిత్ర యాదు మరిచిందీ నేనే దారుణాలు దాష్టికాలు జరుగుతుంటే  చేష్టలుడిగి నిలిచి చూసిందీ నేనే! రాజకీయ ఎత్తుగడల వెనుకమర్మాలు  గతంలోకిజూసి ఒడిసిపట్టిందీ నేనే చైతన్యంలేని సంఘమని విర్రవీగిన  అహంకారుల నోర్లుమూయించబోతుందీ నేనే! పిచ్చివాళ్లనుజేసి ఆడిద్దామనుకున్నవాళ్ళ  రాజకీయ తలరాతలను మార్చబోయేది నేనే ఓటుహక్కుతో దార్శనికులను అందలమెక్కించి కడదాకా అండగా నిలిచే జనతా నేనే! -- రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!

ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం!! బాలెట్ పేపర్ల రోజుల్లో  ఏ వందో..ఓ పూట కూడో ఓ గుక్కెడు సారానో ఓ కుంకుమ భరిణ.. అంతే అంతే ఆ దానికే ఏక్ దిన్ కా సుల్తాన్స్ బూతుకెల్లి ఓట్లు గుద్దేసేవాళ్ళు  టికెట్లు తీసుకుని బస్సెక్కినట్టే పక్కాగా బోర్డుమీది గమ్యానికే! నేడు ఒక్క ఓటుకు ఎన్నివేలో ఎంత సంపదతో సంతర్పనో మందు ప్రవాహం ఆగరాదంతే కుదిరితే అభ్యర్థి ఆస్తిలో వాటాలడుగుడే ఆపై కులం గోత్రం నక్షత్రం అబ్బో ఎన్నో.. ఆ రోజుకి మహారాజులు సుతిమెత్తగా మీటనొక్కేస్తే నేటి EVM హైటెక్ జమానా విమాన ప్రయాణంలానే ఆకాశంలో ఎక్కడికనుకొని మారాజులెక్కారో ఏ ఆగంతుకుడు హైజాక్ చేస్తాడో ఏ గమ్యస్థానాలకి తీసుకెల్తాడో.. అంతా సెక్యూరిటీ (ఈసి) వాడిదయ లాలూచీకి సయ్యంటే ఎన్నికలిక ఫార్సే ప్రజాస్వామ్యామిక గాల్లో ఫ్లైటే ఆగంతకుల చేతిలో కీలుబొమ్మే అధికారానికై దొంగదార్లుతొక్కే దొంగల చేతుల్లో ముమ్మాటికీ కీలుబొమ్మే ప్రజాస్వామ్యం!! మన ప్రజాస్వామ్యం!! - రవి కిషొర్ పెంట్రాల

యుద్ధ విరామ ఒప్పందం!!

యుద్ధ విరామ ఒప్పందం!! విరామం తర్వాత  నేను బ్రతికేందుకు  వీళ్ళలో ఎవరితో పోరాడాలో  నా వాళ్ళ కోసం  ఈ గుంపున ఎందర్ని కడతేర్చాలో! ఆ రోజు నన్ను భయపెట్టిన  ఆ మొహమెవరిదో నా గన్ను తూటాలకి  గాయపడ్డ ఆ శరీరాలెవ్వరివో! కదనరంగంలో చెలరేగుతూ  కర్కశంగా కాల్చేస్తూ  నిరాయుధున్ని దయదలిచి వదిలిన  ఆ దయామూర్తులెవరో! ఎందరికి  ఎందర్ని దూరం చేసానో   ఎందుకు  అందరిని ఎడం చెయ్యాలో! ఎగసిపడే క్రోధం భయం నిరాశలను  తుఫాన్ సమసినట్టుగా చేసిన  తాత్కాలిక యుద్ధ విరామ ఒప్పందం  కలకాలమెందుకుండదో అనుకుంటూ! యుద్ధభూమిలో శత్రుసైన్యంపై  మనసుల్లో ద్వేషం లేదని ఏలికల కీలతో ఆడే  మరమనుష్యులమేననీ తెలుపుకుంటూ! ఇరుసైన్యాల మృతదేహాలకు ఉమ్మడిగా వీడ్కోలు పలుకుతూ  బరువైన హృదయాలతో  అంతిమ సంస్కారాలు జరుపుతూ! ఒకరితోనొకరు ఆడుతూ పాడుతూ మనస్సులు పంచుకుంటూ మళ్ళీ జరగబోయే మరణమృదంగానికి  ముందుగానే క్షమార్పణలు చెప్పుకుంటారేమో? -- రవి కిషోర్ పెంట్రాల

కత్తుల నిచ్చెన !!

కత్తుల నిచ్చెన !! శత్రుసేనని చిత్తుచేసి విజయపు కుర్చీనెక్కేందుకు ఎన్నికల యుద్ధంలో  కూటమిగా పోరాడదామని! వి(స్వ)పక్షాల  పొత్తువిచ్ఛిన్న ప్రయత్నంలో  కూటమిదారిలో విద్వేష మందుపాతరలు వాపు బలమనే తప్పుడు చుక్కానీ దిశలు దిగ్విజయంగా తప్పించుకొని ఒక్కటై(?)! పిడిబాకుల పదును మాటలతో  ఎదిరిపక్షం వెన్నులో వణుకు తెప్పించక పదునైన ఎత్తుల కత్తులతో  విపక్షంపై మూకుమ్మడిగా విరుచుకుపడక! ద్రోహపు పిడిబాకులతో కట్టిన అనుమానపు కత్తుల నిచ్చెనల మీదనుండి  ఓట్ల సమరానికి సిద్ధం కావాలంటే మిత్రపక్షాలకు స్థైర్యమెలా వచ్చేనో! అనుమానపు ప్రయాణం  ఆరాటంలేని ప్రయత్నం  ఆత్మస్థైర్యంలేని పోరాటం  కూటములను ముంచేనో తేల్చేనో! -- రవి కిషోర్ పెంట్రాల

నిశ్శబ్దం!

నిశ్శబ్దం! మిమ్మల్నే కానివ్వండి మొదలెట్టండి మీరేం మాట్లాడాలని మదనపడేవారో  మీకు ప్రసంగించే అవకాశమొచ్చింది గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది! గడబిడా గోలజేసే ఫ్యాను పీకేశాం టెలివిజన్ న్యూసు రగడ తీసేశాం  కంప్యూటర్ మౌసుక్లిక్కులు ఆపేశాం  ఇకజెప్పండి మీ మైండులో ఏముందో! రైళ్ళలసి ప్లాటుఫారంమీద కూలబడ్డాయి  స్టీమర్లూ హార్బరులో రెస్టుతీసుకుంటున్నాయి శునకాలన్నీ తలలువాల్చి పడుకున్నాయి పక్షులన్నీ గూళ్ళలోకిజేరాయి మాట్లాడండి! నగరవాసులకు జోలలుపాడి నిద్రబుచ్చి నగరం ఆదమరచి గాఢనిద్రలోనుంది  కీచురాళ్ళూ కిమ్మనకుండా కునుకేస్తున్నాయి  ఇకనైనా గొంతు సవరించుకుని మాట్లాడండి! వినాలనుంది మీ పలుకులశబ్దాల్లో భద్రంగా దాచుకున్న మీ మనోగతాన్ని ఒంటరితనపు ఆక్రందనల జ్ఞాపకాలు అణచివేతకు పెల్లుబికిన విప్లవగీతాలు! నచ్చని అరాచక రాజకీయ గొడవలు రాకెట్టులతోబాటు ఊరేగే ధరల దడదడలు  క్రూరపు కీచకపర్వాల కలవరపు కలతలు తెలిసినవీ విన్నవీ అనుకున్నవన్నీ మాట్లాడండి! పోనీ నాన్నమోసిన బాధ్యతలమోతలు అమ్మపంచినప్రేమ పిల్లల్నిపెంచినరోజులు  నచ్చినపుస్తకం మెచ్చినప్రదేశం ఊరించేవంట   మీ అంతరంగాన్ని ఆవిష్కరించండి ఎవ్వరూలేరులే ! ఏంటి నోరింకా పెగలడంలేదా వెన్నులో భయమింకా తొలగడంలేదా  పోలింగ్ బూతుకెళ్లి నిశ్శబ్దంగా జీవితానికి భరోసానిచ్చే సరైనోళ్ళని ఎన్నుకోండి! --- రవి కిషొర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!

క్రోధినామ ఉగాది ఉత్సవం!!

క్రోధినామ ఉగాది ఉత్సవం!!     క్రొత్త పాత కోరికల్ని కలబోసి  మస్తిష్కపు బస్తాల్లో ఉబ్బేట్టుగా నింపి చిరుకోర్కెనైనా విడువనిష్టపడక  బలమైన ఆశలబంధంతో కుట్లువేసి  కాలం రథమ్మీద ప్రయాణిస్తూ  శోభకృత్ పొలిమేర దాటుకుంటూ క్రోధి గ్రామం చేరుకుంటూ  సగటు ఓటరు మహాశయులు! ఆ మస్తిష్కపు కోర్కెల బస్తాలు  మా దగ్గర విప్పాలనీ  వాంఛల విత్తుల్ని మొలకెత్తిస్తామనీ ఆకాశాన్నంటగా వృద్ధిజేసి వాటికి వసంతోత్సవం జరిపిస్తామనీ అధికార స్వరంతో.. వాగ్దాన వర్షాలతో..  కుర్చీలనొదల ఇష్టపడని నాయకులు! ఆ మాటకొస్తే  ఆ కోరికలన్నీ మాకెరుకేననీ  వాటిని మేమిప్పటికే  ఇంకుబేటర్లోపెట్టి పెంచుతున్నామనీ  మీమీ ఓట్లు మాకేసి గెలిపిస్తే కోర్కెల ఫలపుష్పాలు మీకిచ్చేస్తామనీ కుర్చీనెక్క కాచుకొన్న నాయకులు! క్రోధిగ్రామం పొలిమేరల్లోనే ఓటర్లకీ పొలిటికల్ లీడర్లకీ  కోర్కెలుతీర్చే ఉత్సవాలనిస్తోందనీ.. మాకు మాత్రం  కమ్మని లేలేత చిగుర్లు  మామిడిపూతలమేసి కూసే కోయిలలు  విరగబూచిన తరుల సొబగులు  హాయైన మలయ మారుతాలు  వెరసి మధుమాసపు సిరులోత్సవాలనీ మెండు మోదంతో.. కించిత్ క్రోధంతో… ఓటు హక్కుకు నోచుకోని జీవులు! - రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్

అసాంఘిక మాధ్యమం!

అసాంఘిక మాధ్యమం! కొందరి కుళ్ళిన మెదళ్ళ దాస్తానా కాస్తా వివరంగా వింటారా దోస్త్ లోగ్ కుక్కగొడుగు సొషల్ మీడియాకే నీచే కుక్కుకొని కుచ్ బేఇన్సాన్ బైటా హై! అనంతాంబర ఛత్రపతిలైన బ్రమలో అశుద్ధాలోచనల్ని నరనరాల పారిస్తూ మదపురాతల మొక్కలు నాటేస్తూ వికృత జంతుప్రవృత్తుల పొర్లాడుతూ! సరళభాషల తర్కాతర్కాలుండవక్కడ జంతుభాషణల అమోఘత్వందప్ప బీకేర్ఫుల్ సాదులోగ్ ఆప్కా జజ్బాత్ అపనా డైరీమే లిక్కే సోజానా జానామత్! పిట్టకూతలూర్లో చెట్లపైజేరి రెట్టలేస్తే పిచ్చికూతల కాకులగుంపులు కోకొల్లలు ముఖపుస్తకమో యూట్యూబో ఇన్స్టానో కామెంట్ల శునకాహారంలోన రేబవళ్ళుదొర్లుడే! నై సునేగాతో జావో మెహస్సూచ్ కరో నైసుదరేగా జాన్వర్ లోగ్ హమేశా జాన్వరీ హోతాహై ఏక్ బార్ కామెంట్ డాల్దియతో బస్ ఖతం జిందగీమె విరక్తి పుట్టేగా జానామత్ ఆస్ పాస్! పుట్టగొడుగుఛత్రం విలువలేక వాడునొకనాడు కులమతాలు హీరోల్లీడర్లు ఆదుకోలేరానాడు ఆడించేవారి చేతిలో పావులడమేమానందం అటెళ్ళకపోవడం మహోత్తమం సుఖం! - రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్

మధు మాసం!!

మధు మాసం!!                     శిశిరంలో చలిపులి గజదొంగగారు నిత్యంతనువంతా తీవ్రంగా తడిమేస్తూ సిరిసంపదలేం దోచుకోబోయారో దౌర్జన్యాల దాష్టికాలేంజేయబోయారో! ఆడంబరంగా అగుపించే ఆస్తుల్ని సర్వంగోల్పోయామని రాల్చుకొనిజూపిస్తూ ఓడుబోడులమని అరకానీకిగొరగామని తుషారబ్బట్టలు పొగమంచు దుప్పట్లప్పుదెచ్చుకుని! వాసంతానేం తెలియని ధైర్యమో తరులకి భద్రంగా బోషాణంలో దాచిన నగానట్రలు రంగురంగుల సొగసైన చీనాంబరాలు ఒక్కొక్కటిగా తీసిపట్టుకొచ్చిపెట్టుకున్నట్టు! కొమ్మకొమ్మకీ చిక్కటి చిగుర్ల పట్టువస్త్రాలు జూకాల్లా తరుశాఖలకివ్రేలాడ్తూ లేకాయలు వివాహానికి నవవధువు ముస్తాబవుతూ వజ్రవైడూర్యాలు కెంపుపచ్చల్ధరించినట్టు! అద్భుతహొయల విరులమేయసౌందర్యసిరులు మధుమాసపురేడు సూరీడ్నిజూసుకొనేమో రవిదొర చలిదొంగని బందీజేశాడేమోనంటూ వాసంత సొబగులు వేనోళ్ళ పొగుడుతూ కోయిలలు! - రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్

ఐ లవ్ యూ.. ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజస్

ఐ లవ్ యూ.. ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజస్     నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో... ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో......... త్వయి స్నేహయామి ................. సంస్కతంలో...  నాన్ ఉన్నె కాదలిక్కిరేన్................తమిళంలో....... నాను నిన్నను ప్రతిస్తునె............కన్నడంలో........ నాన్ నిన్నే స్నేహిక్కున్ను.........మళయాళంలో....... హొమె తుల ప్రేమ్ కర్ తొ...........మరాఠీలో.......... మయి తాను ప్యార్ కరదా...........పంజాబీలో......... మై ఆప్ సే ప్యార్ కర్ తాహుం..........ఉర్దూలో....... మూన్ తుమ్ కో భాలాపాయె............ఒరియాలో....... మును తొమక్ భాల్ పావొ...............అస్సామీలో....... అమి తొమకె భాలొభాషి..................బెంగాలిలో....... తు మొగెల్ మొగచొ.......................కొంకణిలో........ మై ఛా చైన్ మాయి....................కాశ్మీరీలో.......... మా తొగె ప్యార్ కెనదోకైన్..............సింధిలో.............. ఐ నా  నా కగ్బూ నున్ గ్షి.................మణిపురిలో....... హూ తునే ప్రేమ్ కరూతూ...........గుజరాతీలో....... మైనే తానే ప్యార్ కరూ..................రాజస్ధాన్ లో......... కొహియో హక్ చువో................బోడోలో................ మిన్ జో తెరెనాల్ ప్యార్ హెగా............డోగ్రిలో........... హమ్ అహనాసే ప్యార్ కర్ ఛాట్..........మైధిలిలో....... మా తిమిలియా మాయా.................నేపాలీలో........... ఐ లవ్యూ .......................ఇంగ్లీష్ లో......... చూశారా....? ఇదండీ ప్రేమకున్న విలువ.... ఈ భాష ఆ భాష అనికాదు....ఏ భాషలోనైనా... నేను చెబుతానంటే... చాలు వెంటనే వస్తానంటుంది..అందరినోట... నేను నిన్ను ప్రేమిస్తున్నా...అన్న మాట...ఏ భాషలోనైనా సరే... ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులందరూ.... ఒక్కసారి....భాషలు వేరైనా భావాలొక్కటే అంటూ..... ఇవి తలుచుకుంటారని.....అందరికీ అందిస్తున్నాం...... పఠనం చేసుకోండి.....మనస్సులో పదిలం చేసుకోండి... సరైన వారితో మననం చేసుకోండి.... మనసు ఇచ్చి పంచేసుకోండి... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులందరూ.... సంతోషంగా సద్వినియోగం చేసుకుంటారని... ఆశిస్తూ... - మీ కుల శేఖర్  

ప్రేమికుల రోజున ఏ రంగు గులాబి ఇవ్వాలి..

ప్రేమికుల రోజున ఏ రంగు గులాబి ఇవ్వాలి?   ప్రేమికులరోజు ప్రేమించే వారికి ఆ ప్రేమని తెలియచేయాలనుకుంటున్నారా - ఒక్కనిమిషం..... గులాబీ పువ్వుల్లో పెట్టి మరీ మీ మనసు అందించే ముందు....ఏ రంగు గులాబి...ఏ అర్థాన్ని ఇస్తుందో ఒక్కసారి చూడండి....   నాది నిజ్జంగా నిజమైన ప్రేమ నన్ను నమ్ము అని గట్టిగా అరచి చెప్పాలని వుందా....అక్కర్లేదు తెల్ల గులాబీని అందించండి చాలు....మీ భావం తనకి చేరిపోతుంది.     సింపుల్ గా, Sweet గా I love you అని మీ మనసులోని మాటని ఎదుటివారికి చేర్చేది ఎర్రగులాబినే!     మీ Lover మీ Proposal ని accept చేస్తే Pink Rose ఇవ్వండి... Thank you అని చెప్పినట్టే.     పదే పదే ప్రేమంటూ వెంటపడుతుంటే...లేదు Friends గానే వుంటా అని చెప్పాలనుకుంటే....సింపుల్ గా Yellow Roses ఇవ్వండి చాలు.       Lavender Rose ఇస్తే...నిన్ను చూసిన మొదటి క్షణంలోనే పడిపోయానని చెప్పకనే చెప్పినట్ట.       జన్మలో నిన్ను ప్రేమించలేను....పో అని నోటితో చెప్పలేక పోతే ఓ Blue Rose ఇవ్వండి చాలు.       Red, White Roses ని కలిపిస్తే ఇద్దరం ఒకటిగా Life Start చేద్దామా అని అడిగినట్ట.       Red, Yellow Roses కలిపి ఇస్తే....నేను నీతో చాలా Happy గా వున్నానని చెప్పటం.     రంగులే కాదు గులాబీల సంఖ్య కూడా ముఖ్యమే ఏ  రంగు గులాబీ అయినా కానివ్వండి. 1 ఇస్తే ....మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానని చెప్పటం. I love you అని నోటితో చెప్పలేకపోతే Simple గా 3 గులాబీలు ఇవ్వండి చాలు. 6 గులాబీలు ఇస్తే...నీ స్వంతం కావాలనుకుంటున్నా అని చెప్పినట్ట. 40 గులాబీలు ఇస్తే నువ్వు మాత్రమే నాకు Perfect అని అరిచి చెప్పినట్టు.  

మా చిన్ననాటి భోగి!

మా చిన్ననాటి భోగి!  జంగమదేవర శంఖపు రవళులు శంభోశంకర నాదంతో ఊరంతా.. అంబ పలుకు జగదంబ పలుకు  వాక్కులతో బుడబుక్కల ఢమఢమలు భోగి వేకువజాముకు వేకువకాగ! చెరువుకు నీళ్ళకి నాన్న కావిడితో మావూరి చెరువేమో తెలిమంచు కప్పుకొని సూరీడికేదో కబురివ్వాలని రాయబారి శీకరపు దొంతరతో మంతనాలు ఎంతకీ ఒగదెగవవి ప్రభాతమంతా! తోటిపిల్లలతో దార్లన్నీ తిరిగి ప్రోగేసుకున్న వరికర్రలో తుమ్మ పత్తి వేపపుల్లలో అమ్మ వంటకి దాచిన వంటచెరుకో అన్నిటితో బోగిమంటకు తయ్యారు! అత్తయ్య మామయ్య తాతయ్య నానమ్మలు ఎడారిలో అరబ్బీషేకుల్లా ఒళ్ళంతా రగ్గులతో తలపాగా కట్టుకొని చెవులచుట్టూ చలికి.. నాన్న తోబుట్టులు నీళ్ళ బిందెలతో హాజరు అమ్మ తోడుకోడళ్ళతో వంటలింకా తెమలక! రంగవల్లులు అల్లాలని తొందరలో అక్కావదిన గొబ్బెమ్మలు బంతిపూల ఏర్పాట్లలో చెల్లీమరదలు పిన్నీబాబాయి అగ్నిదేవుని ప్రార్ధనజేసి నెయ్యివేసి  బోగిమంట రాజేస్తే బందుగణమంతా చుట్టూ! మేమంతా బోగిమంటన చలిగాచుకుంటుంటే క్రొత్తధాన్యపు బస్తాలబండ్లతో ఇల్లకు కొందరు దారంతా రంగుల మ్రుగ్గులు పెడుతూ ఇల్లాల్లు అయ్యవారికి దండంబెట్టంటు గంగిరెద్దులోళ్ళూ! కాటికాపరొస్తే మాత్రం ఏ పురి చాటునో దాక్కునేది  చటుక్కున ఎక్కడ నుంచి ఏం తీస్తానంటాడొనని.. ఊరంతా సందడే! అన్ని మూలలా రంగవల్లులు! హరిదాసులు శ్రీ మద్రమణ గోవిందో హరంటూ.. బావలు పిట్టల దొరలా కధలు చెబుతుంటె సినిమా కథలకి పనికొస్తాయని నవ్వుతూ మేము! భోగిమంటన హవిస్సులు ఎంత సమర్పించాలో ఎప్పుడు మంటనిప్పులు కదపాలో అణచాలొ చుట్టూజేరి జాగ్రత్తలుజెప్పు పెద్దలజూస్తే జీవనగమనంలో సుఖదుఖాల్లో ఎల్లప్పుడూ మీ వెంటమేమని అగ్నిసాక్షిగా భరోసానిచ్చు నా  వారిగా తృప్తిగా రేపటి సంక్రాతికి ఎదురుజూస్తూ! --రవి కిషోర్ పెంట్రాల

కులం!

కులం! స్వదేశములో విదేశాలలో  వాట్సాపులో ఫేసుబుక్కులో  ఇన్స్టాగ్రాములో ట్విట్టర్లో  ప్రపంచమంతా విస్తరిస్తూ విద్వేషం చిందిస్తూ కులం! సమాజాన్ని చీలుస్తూ కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! బడి ఒడిలో  కళాశాలలో విశ్వవిద్యాలయంలో  బ్రతుకుబడిలో  కులంతోనే చోటిస్తూ కులంతోనే వేర్జేస్తూ  కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! రాజకీయాల్లో  చలనచిత్రాల్లో  వ్యాపారాల్లో  కీలకపదవుల్లో  మీవాళ్ళే అంతానంటూ  దోచుకుతినేస్తున్నారు మమ్మల్నంటూ  కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! నాయ'కుల' ఎన్నికలలో  అధికారుల పదోన్నతులలో దేవుడిధర్మకర్తల నియామకాలలో  మనిషిశ్వాసవీచే ప్రతిచోటా  కులం శ్వాస పీలుస్తూ కులం వంట భుజిస్తూ కులప్రవాహంలో  కొట్టుకుంటూ కొట్టుకుపోతూ మనిషితనాన్నీ మానవత్వాన్నీ ఖూనీ చేస్తూ కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! కులం! --- రవి కిషోర్ పెంట్రాల, లండన్!

లోపలి మనిషి!

లోపలి మనిషి! వసపిట్టొకటి అంతరంగంలో బయటకొచ్చి కూసేసేయాలనీ మాటలన్నిటినీ సరిదిద్దేయాలనీ కుదరదు గమ్మునుండమని నేను! కులమతప్రాంతాల మధ్య చిచ్చులెట్టి భావోద్వేగాలు పెంచబోతుంటే సమాజాన్ని నిలువునా చీల్చబోతుంటే అధర్మమంటది గమ్మునుండమని నేను! గుప్పించిన హామీలు మర్చిపోతుంటే  మడమత్రిప్పి నడకలు మారుస్తుంటే  అస్మదీయులకు ఆస్తులు దోచిచ్చేస్తుంటే  అన్యాయమంటది గమ్మునుండమని నేను! కుయుక్తుల సమరంలో గెలిచిన సీట్లు అక్రమాలతో ఆర్జించిన కోటానుకోట్లు పైరవీలతో పైపదవులకు వేసుకున్నమెట్లు వదిలించేస్తావేమిటీ గమ్మునుండమని నేను! అర్ధరాత్రులప్పుడప్పుడు నిశ్శబ్దంలో ప్రపంచం గాఢనిద్రలోనున్నపుడు మనం నిర్భయంగా మాట్లడుకోవట్లేదూ ఇప్పుడుగాదులే గమ్మునుండమని నేను! నిష్టూరంగా వాగివాగి విసిగిస్తున్నావు విస్కీరమ్ముల్తో నిలువెల్లా ముంచేసినా సిగిరెట్టు పొగల్తో ఉక్కిరిబిక్కిరి జేసినా చంపేస్తున్నావు గమ్మునుండమని నేను! తెలుసుగా మిత్రమా నేనెవరో అలవోకగా రంగులు మార్చేయగలను మనస్సాక్షివైతే మాత్రమేంటి ఏమార్చగలను  సడీసప్పుడు జేయక గమ్మునుండమని నేను! - రవి కిషొర్ పెంట్రాల, లండన్!

ఆదివారపు అవసరాలు

ఆదివారపు  అవసరాలు  బద్ధకపు ఉదయపు మబ్బు నుండి  పరుగెత్తే మేఘం లాంటి మరో ఉదయం వరకూ ఓ ఖాళీ.. ఆశలు ఆశయాలకు సెలవు.. తీరిక వేళ అంటారు కొందరు.. వీకెండు అని అంటారు మరికొందరు.. మత్తుగా నిదురోతున్న గమ్మత్తైన దేహం .  ఇరుగుపొరుగు వారింట్లో నాన్ వెజ్ వంటల గుమగుమలు.. కాసేపు విరామం.. కాసేపు ఏదో తీరికలేని పని.. కాసేపు టీవీలో  కాలక్షేపం.. మరికాసేపు సోషల్ మాధ్యమంలో బిజీ.. అవసరం లేని పనుల్లో  అవసరం చేసుకొని మరీ బిజీ  అయ్యే ఆపద్భాందవులు ఎంతో మంది.. ఖాళీగా ఉండటం.. తినాలనుకున్నది తినాలనుకోవడం.. మనం మాట్లాడాలనుకున్నవాళ్ళతో మాత్రమే మాట్లాడటం.. ఇవన్నీ ఆదివారపు అవసరాలే.. ✍🏻.దాసరి మల్లేశ్