సొజ్జ బూరెలు
ఉగాదికి దేవుడికి ఆరగింపు పెట్టడానికి తీపి వంటకం చేయాలి కదా... అయితే అది ఎక్కువ టైం తీసుకోని వంటకం అయితే బావుంటుంది అనుకుంటాను నేను. అందుకే పెద్ద పిండి వంటకాలకి షార్ట్ కట్స్ ఏమిటని మా అక్కని అడిగితే కొన్ని నేర్పించింది. అందులో ఇది ఒకటి. రుచిలో అసలు వంటకానికి పోటీ పడుతుంటుంది. మనవాళ్ళకి ఇవ్వటానికి కూడా బావుంటుంది. సాంప్రదాయ పిండి వంటకం చేశామన్న తృప్తి వుంటుంది. మీరు నాలానే ఆలోచిస్తే ఈ వంటకాన్ని ఈసారి ఉగాదికి ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ ....... అర కేజి
పంచదార .............. అర కేజి
నెయ్యి .................. చిన్న కప్పుతో
బియ్యం పిండి ...... ఒక కప్పు
మైదా పిండి ....... రెండు చెమ్చాలు
సెనగ పిండి ....... అర కప్పు
నూనె .......... వేయించటానికి తగినంత
ఉప్పు ......... చిటికెడు
వంట సోడా .... చిటికెడు
యాలకుల పొడి ... అర చెమ్చా
తయారీ విధానం:
ముందుగా బూరెలలోకి తోపు పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. మాములుగా తోపు పిండి అంటే బియ్యం, మినప్పప్పు కలిపి నానబెట్టి, దోశల పిండిలా రుబ్బుకుని దానిని వాడతారు. అలా చేసుకునే వీలు, సమయం వుంటే తోపు పిండి అలా చేసుకోవచ్చు. లేదంటే ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు పొడి పిండ్లు కలిపి తోపు రెడీ చేసుకోవచ్చు. బియ్యం పిండి, సెనగ పిండి, మైదా పిండిని కొంచం నీరు పోసి జారుగా కలుపుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకోవాలి. దానికి ముందుగా బాణలిలో నాలుగు చెంచాల నెయ్యి వేసి , వేడి ఎక్కాక నూక వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి. అలా వేగిన నూకని ప్లేట్‌లోకి తీసుకుని, ఆ బాణలిలో ఒకటికి, ఒకటిన్నర చొప్పున నీళ్ళు పోసుకోవాలి. (ఒక గ్లాసు నూకకి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు ) నీళ్ళు కళపెళ మసులుతుండగా వేయించిన నూక వేసి కలపాలి... నూక వేస్తుంటేనే ... గట్టి పడి దగ్గరకి వచ్చేస్తుంది.. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. (పంచదార కొద్దికొద్దిగా వేస్తూ , బాగా కలుపుతూ వుండాలి .. లేదంటే ఉండలు కడుతుంది నూక). కాసేపటికి నూక మిశ్రమం దగ్గరకి వస్తుంది. అప్పుడు ఓ రెండు చెమ్చాల నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పూర్ణం చల్లారాక చిన్న, చిన్న ఉండలుగా చేసి, తోపు పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి.
-రమ