కొబ్బరి మోదకాలు (వినాయక చవితి స్పెషల్)

 

 

 

కావాల్సిన పదార్ధాలు:-

బియ్యం పిండి                                      - 1కప్పు   
నీళ్లు                                                   - 1కప్పు              
కొబ్బరి తురుము                                 - 2 కప్పు      
బెల్లం తురుము                                   -1 కప్పు      
ఇలాచీ పొడి                                         - 1/2స్పూను           
నెయ్యి                                                 -  తగినంత
ఉప్పు                                                 - చిటికెడు 


తయారుచేయు విధానం:-

* ముందుగా బాండి లో బెల్లం తురుము తో పాటు , కొబ్బరి తురుము వేసి సన్నని సెగ మీద  కలుపుతూ ఉండాలి.  ఇది ముద్దలా దగ్గరికి రాగానే , ఇలాచీ పొడి , కాస్త నెయ్యి వేసి స్టవ్ మించి దింపుకోవాలి.

* ఇప్పుడు మరో పాత్ర లో కప్పు నీళ్లు తీసుకుని చిటికెడు ఉప్పు, చెంచా నెయ్యి వేసి    నీళ్ళని బాగా మరిగించాలి  . ఈ మరుగుతున్న నీళ్లలో బియ్యంపిండి ని వేస్తూ బాగా కలపాలి.

* ఇప్పుడు స్టవ్ ఆర్పి, ఈ పిండిని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మళ్ళీ అరచేతుల్లోకి తీసుకుని చపాతి పిండి లా   బాగా   కలపాలి.  ఈ ముద్దను  పది నుంచి పదకొండు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

* ఇప్పుడు ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని, పలుచగా  పూరి లాగ చేతితో వత్తుకుంటూ అరచేతి మందం చేసుకోవాలి. దీనిలో ముందుగా తయారు చేసి ఉంచుకున్నకొబ్బరి  బెల్లం ముద్దను పెట్టి, అన్ని వైపుల నించి పూరి ని పైకి లాగుతూ చక్కగా మూసి వేయాలి.

* ఇలా మొత్తం పది నుంచి పదకొండు మోదకాలు తయారు చేసికోవచ్చు.

* ఇప్పుడు ఈ మోదకాలను  ఓ పది  నిమిషాలు  ఆవిరిపై ఉడికించాలి.  ప్రెషర్ కుక్కర్ పై వెయిట్ లేకుండా  గానీ  లేదా, ఎలక్ట్రిక్ కుక్కర్ లో గాని ఉడికించవచ్చు.

* వినాయక చవితి  గణేశుడి నైవేద్యానికి, కొబ్బరి మోదకాలు  రెడీ.