గోధుమపిండితో కేక్
సాధారణంగా మైదాపిండి ఉపయోగించి కేక్ ను తయారు చేస్తారు. కానీ గోధుమ పిండితో కూడా కేక్ తయారుచేసుకోవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే మైదా పిండితో చేసిన కేక్ కంటే గోధుమపిండితో చేసిన కేక్ ఎక్కువ రుచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రైచేయండి.. నిజమని ఒప్పుకుంటారు.
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి – 2 కప్పులు
నెయ్యి – 1 కప్పు
చక్కెర – 2 కప్పులు
గుడ్లు – 4
పాలు – 1/2 కప్పు
బేకింగ్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
వెనిల్లా ఎసెన్స్(ఇష్టమైన ఎసెన్స్ వాడుకోవచ్చు) – కొద్దిగా
తయారీ విధానం:
* ముందుగా గోధుమపిండి, బేకింగ్ పౌడర్ రెంటిని కలిపి జల్లించి పెట్టుకోవాలి. తరువాత పంచదారను మిక్సిలో పొడి చేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు తీసుకొని పచ్చసొనను తెల్ల సొనను వేరు చేసి పెట్టుకోవాలి.
* ఇప్పుడు పొడి చేసుకొని పెట్టుకున్న పంచదారలో నెయ్యివేసి బాగా కలుపుకొని దీనిలో గుడ్ల పచ్చసొనను ఒక్కోక్కటి వేసి మొత్తగా దూదిలా కలుపుకోవాలి.
* ఇప్పుడు తెల్ల సొనలో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి ఒక 10 నిమిషాలు బాగా గిలక్కొడితే దూదిలాగా తెల్లగా అవుతుంది. క్రీం లాగా అయ్యేవరకు బీట్ చేయాలి.
* ఇప్పుడు పచ్చసొన, చక్కెర, నెయ్యి మిశ్రమంలోకి ఒక సారి పిండి, ఒకసారి పాలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అంతా కలపాలి. ఈ మిశ్రమంలో తెల్ల సొన, చక్కెరతో చేసిన క్రీంను వేసి బాగా కలుపుకోవాలి.
* చివరిగా వెనిల్లా ఎసెన్స్ ను వేసుకోవాలి
* ఇప్పుడు అవెన్‌ను 175 ఉష్ణోగ్రత వద్ద 10 నిమిషాలు వేడి చేసుకొని.. అవెన్ వేడెక్కేలోపు పార్‌చ్మెంట్ పేపర్ లైనర్ లో మిశ్రమం వేసి సిద్దం చేసుకోవాలి. దీనిని అవెన్ లో పెట్టి కేక్ ఉడికే వరకూ ఉండుకోవాలి.