బ్రెడ్ తో యమ్మీ గులాబ్ జామూన్

 


గులాబ్ జామూన్ పేరు వినగానే ఎప్పుడెప్పుడు తినాలా అని నోరు ఊరిపోతుంది. సాఫ్ట్ గా, స్వీట్ గా ఉండే గులాబ్ జామూన్ బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసిపెడితే బాగుంటుంది.

 

కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసెస్ - 10

పంచదార - 1 1/2 కప్పు

చిక్కని పాలు - 1 కప్పు

ఏలకుల పొడి - కొద్దిగా

జీడిపప్పు, బాదం పప్పు - 2 స్పూన్స్

 

తయారి విధానం:

బ్రెడ్ తో గులాబ్ జామూన్ చేసుకోటానికి ముందుగా పంచదారని పాకం పట్టాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పంచదార, నీళ్ళు పోసి కాస్తంత తీగపాకం వచ్చే దాకా మరిగించి, యాలకుల పొడి జతచేసి పక్క పెట్టాలి.

 

ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ చుట్టురా ఉన్న అంచులని తీసేసి అన్ని ముక్కలని మిక్సిలో వేసి పొడి చెయ్యాలి. మెత్తగా పొడి అయిన బ్రెడ్ ముక్కల్లో చిక్కటి పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.

 

పాలు చిక్కగా రావాలంటే 2 కప్పుల పాలను 1కప్పు అయ్యేలాగా మరిగించాలి. ఇలా తయారుచేసిన ముద్దని చిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.

 

కావాల్సిన వాళ్ళు ఈ ఉండల్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి మధ్యలో పెట్టి అవి కవర్ అయ్యేలా చూసుకుని ఉండలు చుట్టుకోవచ్చు.అలాగే పచ్చికోవాను కూడా కాస్త కలుపుకోవచ్చు. 

 

స్టవ్ మీద కడాయి పెట్టి నూనే వేసి అది కాస్త మరిగాకా సిమ్ లో పెట్టి తయారుచేసుకున్న ఉండాలని వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి.

 

ఉండలు కూడా చల్లారాకా ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేస్తే చాలు తియ్యగా, మృదువుగా ఉండే గులాబ్ జామూన్ రెడీ అయిపోతుంది. పాకం చల్లారాకా ఉండలు వేయటం వల్ల అవి ముద్దగా ఊడిపోకుండా ఉంటాయి.  


...కళ్యాణి