EVENTS
తాల్ బాలల దినోత్సవ వేడుకలు 2022

తాల్ బాలల దినోత్సవ వేడుకలు 2022

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో 14వ బాలల దినోత్సవం శనివారం 26 నవంబర్ 2022 న ఘనంగా నిర్వహించారు. 300 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులతో పాటు, లండన్ మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది బాలలు వివిధ కళలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.

సాంప్రదాయ, భక్తి, సినీ సంగీత నృత్య గీతాలు, చిత్రలేఖనము, ఫాన్సీ డ్రెస్, పలు రకాల వాయిద్య ప్రదర్శనలతో ఆద్యంతం కార్యక్రమం కనుల పండువగా జరిగింది. అయిదు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం లో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూకే ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొని తాల్ ప్రతి ఏటా నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలు కొనియాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు వారికి ఆటవిడుపుగా ఉండి ఉత్సాహాన్ని కలిగించటం తో పటు భావి తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది అని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ అభినందించారు. ఇదే కార్యక్రమంలో ఒక చిన్నారి నృత్యం చేసిన బుల్లెట్ బండి పాటకి కొనసాగింపుగా కొందరు ఆడ పడుచులతో పాటు ఎంపీ సీమా మల్హోత్రా కూడా అడుగులో అడుగు వేసి నృత్యం చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాల్ చైర్మన్ శ్రీమతి భారతి కందుకూరి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాల్ సాంస్కృతిక కేంద్రాలలో తమ పిల్లలను చేర్పించి, భావి తరాలకి తెలుగు భాష మరియు సంస్కృతిని అందించేలా సహకరించాలని తెలుగు వారిని కోరారు. తాల్ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్నిఅందిస్తున్న తల్లిదండ్రులు, తాల్ సభ్యులు మరియు కార్యకర్తలకు తాల్ ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.

ట్రస్టీ గిరిధర పుట్లూర్ తాల్ సాంస్కృతిక కేంద్రం (TCC) నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వివరాలు తెలిపారు. TCC లో చేరి తెలుగు నేర్చుకుంటున్న జూలీ ల్యూఆంకో అనే విదేశీ మహిళా తెలుగు పద్యాలను చెప్పటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాల్ బాలల దినోత్సవం విజయవంతముగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన శ్రీదేవి అల్లెద్దుల, అనిల్ రెడ్డి, దివ్య రెడ్డి, సునీత అరిగే, సుజాత గాదంసేతి, భారతి సుదనగుంట, హరిణి గెడ్డం, అశోక్ మాడిశెట్టి, జ్యోతి కస్తూరి , స్వాతి మేడిశెట్టి, రాయ్ బొప్పన్న , రిషి లకు కల్చరల్ ట్రస్టీ నవీన్ గాదంసేతి కృతఙ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీ లు అనిల్ అనంతుల, కిషోర్ కస్తూరి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, అనిత నోముల కూడా ఇందులో పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమానికి ఆద్యంతం సమయస్ఫూర్తితో వ్యాఖ్యాతగా వ్యవహరించిన RJ శ్రీవల్లి ని అందరూ అభినందించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;