RELATED EVENTS
EVENTS
అద్వితీయం, కమనీయం, నేత్రానందం - శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ఉత్సవం

 

మార్చి 30న సిలికానాంధ్ర శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ఉత్సవాన్ని సన్నీవేల్ హిందూ దేవాలయంలో ఘనంగా నిర్వహించింది. మాఢభూషి విజయసారధి గారి అధ్యక్షోపన్యాసంతో మొదలై, పన్నెండు వందల మంది ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమంలో సాయంత్రం పంచాంగ పఠనం, కవి సమ్మేళనం, నేత్రావధానం మొదలైన అంశాలు జరిగాయి. మారేపల్లి నాగ వెంకటశాస్త్రి గారు పంచాంగం లోని విశేషాలను నేటి కాల మాన జీవన పరిస్థుతులకు అన్వయిస్తూ విశ్లేషించారు. తాటిపాముల మృత్యుంజయుడు అధ్యక్షతన జరిగిన హాస్య కవి సమ్మేళనంలో మధు ప్రఖ్య, గునుపూడి అపర్ణ, పుల్లెల శ్యాంసుందర్, వంశీ ప్రఖ్య, మారేపల్లి నాగ వెంకటశాస్త్రి గారు పాల్గొన్నారు. వైవిధ్యమైన విషయాలపై రచించిన వచన, పద్య కవిత్వం శ్రోతలను అలరించింది.

 

 

రెండు గంటల పాటు జరిగిన నేత్రావధానం ఈ ఉత్సవానికి మకుటాయమానంగా నిలిచింది. అవధానులు శ్రీమతి రమాకుమారి, శ్రీమతి లలితాకామేశ్వరి జరిపిన ఈ అద్వితీయ ప్రక్రియకు మధు ప్రఖ్య సంధానకర్తగా వ్యవహరించారు. కొటికలపూడి కృష్ణ, కాశీవఝ్జుల శారద, కూచిభొట్ల శాంతి మరియు శం షాద్ మొహమ్మెద్ లు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. పృచ్ఛకులు తెలుగు, ఆంగ్ల, హిందీ, సంస్కృత భాషల్లో, అంకెల్లొ ఇచ్చిన సమస్యలను ఒక అవధాని స్వగతంగా చదువుకొని కనుగుడ్డు, కనురెప్పల కదలికలు, సైగల ద్వారా రెండవ అవధానితో భాషించడం, రెండవ అవధాని ఆ కంటి సంజ్ఞలను ఇచ్చిన సమస్యలోకి యధాతధంగా అనువదించడం అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. కొన్ని సమస్యలు రెండు లేదా మూడు భాషల మిళితంగా కూడా  ఇవ్వబడ్డాయి. చివరలో, అమెరికాలో మొట్టమొదటి సారిగా అవధానులు పుష్పావధానం, అంగుష్టావధానం కూదా చేసారు. కళ్లకు బదులు పువ్వు, చేతి బొటన వ్రేలి కదలికలను ఉపయోగించి సమస్యలను పూరణ చేసారు. అవధానంలోని అప్రస్తుత ప్రసంగంలా, సుమారు రెండు గంటల పాటు జరిగిన నేత్రావధానంలో మధు ప్రఖ్య గారు ఎడతెరిపి లేకుండా వ్యాఖ్యానం చేస్తూ ప్రేక్షకులకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, వైస్- చైర్మన్ కొండిపర్తి దిలీప్ అవధానులను, పృచ్ఛకులను సత్కరించారు.


 
ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు వందల మంది పిల్లలు తెలుగు భాషా వికాస పోటీల్లొ పాల్గొని తెలుగు భాషపై తమకు ఉన్న పట్టును, మక్కువను ప్రదర్శించారు. కాజ మాధురి, తనుగుల సత్యప్రియ సమన్వయకర్తలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి చమర్తి రాజు, కొండుభొట్ల దీనబాబు, అన్నం అనిల్, మంగళంపల్లి రాజశేఖర్, కాజ రామకృష్ణ, తనుగుల సంజీవ్, నరసిం హమూర్తి, శ్రీసుధ, చివుకుల రవి, ఉపాధ్యాయుల సిద్ధార్థ, కూచిభొట్ల రవీంద్ర, నాదెళ్ల వంశీ, ఇంకా ఎంతో మంది కార్యకర్తలు విజయవంతం కావడానికి సహకరించారు. సిలికానాంధ్ర అన్నపూర్ణలు, నలభీములు స్వయంగా షడ్రసోపేతమైన భోజానాన్ని వండి, వడ్డించగా అద్దంకి శరత్ దాతగా విరాళమిచ్చారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;