RELATED EVENTS
EVENTS
Manabadi 5th Anniversary Celebrations

సిలికానాంధ్ర 'మనబడి' ఐదవ సాంస్కృతికోత్సవం స్థానిక సన్నివేల్ హిందూ దేవాలయ ఆవరణలో ఘనంగా ఫిబ్రవరి 4,5 తేదీలలో జరిగింది. 2007లొ ప్రారంభమైన మనబడి కార్యక్రమము, ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని, అమెరికాలో పదిహేను పైగా రాష్ట్రాలలో  విస్తరించి,  1700ల మంది  బాల బాలికలను తెలుగు భాషలో సుశిక్షితులను  చేస్తున్నది. తెలుగు నేర్చుకున్న పిల్లలు భాషలో తమ ప్రావీణ్యాన్ని సాంస్కృతికోత్సవంలో లఘునాటికలు, పాటలు, పద్యాలు, దేశభక్తి గేయాల  ద్వారా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. 

 

 

సాంప్రదాయ పద్ధతిలో వేద ప్రవచనంతోను, పిల్లలకు, వారికి తెలుగు భాష నేర్పించి తమ మాతృభాషను భావితరాలకు అందించాలని సంకల్పించిన తల్లి తండ్రులకు ఋత్వికులచే  ఆశీర్వచనంతో కార్యక్రమం ప్రారంభమైంది.బే ఏరియాలోని ఫ్రీమాంట్, క్యుపర్తినో, కాంప్బెల్, ఫాస్టర్ సిటి, ట్రై వాలి, డబ్లిన్, సాన్ జోసె ఎవెర్ గ్రీన్ శాఖలలోని విద్యార్ధినీ, విద్యార్ధులు సాంస్కృతికోత్సవంలో పాలుపంచుకున్నారు. పిల్లలు ప్రదర్శించిన భక్త ప్రహ్లాద, కురుక్షేత్రం లఘునాటికలు విశేషంగా ఆకట్టుకున్నాయి.గొబ్బియళ్ళు, గురివింద గింజ పాటలు, పెద్దలందరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేశాయి. తేనెల తేటల మాటలతో, ఏ దేశమేగినా, మా తెలుగు తల్లికి వంటి దేశభక్తి గీతాలు అందరికీ భారతదేశాన్ని, సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ని గుర్తు చేసాయి.

 

 

సిలికానాంధ్ర అధ్యక్షులు  కొండుభట్ల దీనబాబుగారు  మాట్లాడుతూ,  మనబడి  కార్యక్రమంతోబాటు,  కిందటి సంవత్సరం ప్రకటించినట్లు  సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్నికూడా స్థాపించి తెలుగు భాషకు సేవ చేస్తామని, అందుకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందిరికి తమ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు కుచిభోట్ల ఆనంద్ గారు  పిల్లలకి తెలుగు నేర్పాలన్న ఆలోచనతో 'మనబడి'లో చేర్పించి సిలికానాంధ్ర చేస్తున్న ప్రయత్నానికి ప్రోత్సాహం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.

ఆనంద్ గారు 2012లో సిలికానాంధ్ర తలపెట్టిన అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం, మూడవ అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం గురించి వివరించారు. మనబడి కులపతి చమర్తి రాజుగారు, పిల్లలు తాము నేర్చుకున్న తెలుగు భాషా పాటవాన్ని ప్రదర్శించిన విధం చూసి, మనబడి కార్యక్రమ విజయానికి తోడ్పడిన వారందరి కృషి ఫలించడం చూసి, మరింత పాటుపడాలన్న కోరిక కలుగుతోందని తెలియజేశారు. మనబడి ప్రణాళిక బృందాన్ని, అధ్యాపకులను,  కార్యకర్తలను రాజుగారు పరిచయం చేశారు. బే ఏరియాలోని కార్యక్రమానికి వేదుల స్నేహ, మాలంపాటి ప్రభ, మాడభూషి విజయ సారధిగార్లు సంధానకర్తలుగా వ్యవహరించారు. రాబోవు వారాలలో టెక్సాస్ లోని డల్లాస్ లో, న్యూ యార్క్ లో కూడా మనబడి సాంస్కృతికోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.

TeluguOne For Your Business
About TeluguOne
;