RELATED EVENTS
EVENTS
సిలికానాంధ్ర మనబడి కి డల్లాస్ లో చక్కటి ఆదరణ

మన మాతృభాష, తెలుగు భాష, ప్రాచీనభాష స్థాయి నుంచి ప్రపంచభాషగా వెలుగొందడానికి, ఇంకా వెయ్యేళ్ళ పాటు తిరుగులేని భాషగా ప్రజ్వరిల్లడానికి, మనసుల్లో తెలుగు భాషాజ్యోతిని వెలిగించాలి. ఆ సుసంపన్న మేధా క్షేత్రాలలో భాషాబీజాల్ని నాటాలి. నేటి బాలలే రేపటి తెలుగు సంస్కృతీ ప్రపంచపు పౌరులై తెలుగుతల్లి కీర్తి పతాకాన్ని దశదిశలా ఎగురవేయాలి. ఆ ఆశయంతో మొదలైన సిలికాంధ్ర మనబడి ఉద్యమం, నేడు అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో 5 ప్రధాన పట్టణాలలో, 165 మంది విద్యార్థులతో, 30 మంది ఉపాద్యాయులతో, గత నాలుగేళ్ళుగా విజయవంతంగా నడుస్తున్న మనబడి, సాంస్కృతికోత్సవాన్ని రంగరంగ వైభవంగా జరుపుకొంది. మనబడితో వెలిగించబడిన చిరుబాలాజ్యోతులు, డాలస్ నగర సీమల్లో, ఈ శ్రీ ఖరనామ సంవత్సర మాఘమాస చవితి శనివారం, ఫిబ్రవరి 11 వ తేదీ, సాయంత్రం తారల జల్లు కురిపించాయి. చిరునవ్వుల పరిమళాన్ని వెదజల్లాయి. సిలికానాంధ్ర మనబడిలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలందరూ మనబడి సాంస్కృతికోత్సవాన్ని దివ్యంగా నిర్వహించి, ఈ రోజుని సిలికానాంధ్ర చరిత్రలో మరొక్క మైలురాయిగా నిలిపారు. దాదాపు 650 మందికి పైగా పిల్లలు, పెద్దలు వచ్చి ఈ కార్యక్రమంలో చిన్నారులు అందించిన తెలుగు భాషామృత గులికల్ని స్వీకరించి, వారికి మనస్పూర్తిగా దీవెనలిచ్చారు. ప్రిస్కో ఉన్నత పాఠశాలలో సిలికానాంధ్ర శోభ వెల్లివిరిసింది. సిలికానాంధ్ర మనబడి డల్లాస్ సమన్వయకర్తలు జట్టు యనగండ్ల నాగ్ గారి అద్భుతమైన ప్రణాళికా నిర్వహణతో, మడక ప్రేమ్, అక్కల మోహన్, మరియు షేక్ నసీం గార్లు సేనాపతులుగా, పాతికమంది సేవాసైనికుల సహాయంతో, నగర మనబడి సమన్వయ కర్త రాయవరం విజయభాస్కర్ నేతృత్వంలో, వివిధ నగరాల్లో పిల్లలకి చదువు చెప్తున్న గురువులందరి శిక్షణా సహయాలతో, ఈ కార్యక్రమం చక్కగా అమరింది. డాలస్ నగర సీమల్లో ప్రతీ మూలన ఉన్న తెలుగు వారందరికీ ఈ కార్యక్రమం గురించి ప్రచారం చెయ్యడంలో, తన స్వరాన్ని, విలువైన సమయాన్ని, వరంగా ఇచ్చిన యువ తెలుగు రేడియో సారధి కే.సి. చేకూరి గారు కృషి వల్ల, పిల్లల పరిశ్రమకి మంచి ప్రోత్సాహం లభించింది. వారి ప్రతిభాపాటవ ప్రదర్శనకు ఈ సాంస్కృతికోత్సవం, చక్కటి వేదిక అయ్యింది. స్థానికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ వారి సహాయ సహకారాలతో ఈ సభ విజయవంతమైంది. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటి (నాట్స్), డీఎఫ్ డబ్ల్యు బతుకమ్మ సంస్థల స్థానిక సహకారంతో... మై టాక్స్ ఫైలర్. కాం, విష్ పాలపు సి.పి.ఎ, ఒహ్రీస్ భోజనశాల, దేశీప్లాజా, యూయస్, రేడియో ఖుషీ. కాం, గురుస్వర.కాం మరియు ఇంకా అనేక దాతల విరాళ సహాయంతో, ఈ దివ్యమైన కార్యక్రమం సజావుగా సాగింది.

 

 

సరిగ్గా 3:30 గంటల మధ్యాహ్నం ముహూర్తానికి, శ్రీ లలితా పీఠపు ప్రధాన గురువులు శ్రీ శంకరమంచి ప్రసాద శర్మ గారి వేద ప్రవచనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రకటించిన సమయానికి కార్యక్రమం మొదలు పెట్టడంలో మనబడి ప్రమాణాన్ని నిలబెట్టడం జరిగింది. ఉపాధ్యాయుల బృందం కలిసి పాడిన 'వందేమాతరం' జాతీయగీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత తూర్పు మరియు పడమర ప్లేనో, ఫ్రిస్కో, ఇర్వింగ్, కోపెల్, మరియు ప్లవర్ మౌండ్ కేంద్రాల్లో తెలుగ నేర్చుకొంటున్న పిల్లలు, వారి గురువులు శోభాయత్రగా వచ్చి వేదికని అలంకరించారు. చక్కని తెలుగు సంప్రదాయ దుస్తుల్లో, మిలమిల మెరిసే అలంకారాలతో వచ్చిన పిల్లలవల్ల, వేదికమీదకి తారలు దిగి వచ్చినట్లనిపించింది. అతి చక్కని శోభాయాత్ర తర్వాత, ప్రధాన సంధానకర్తలుగా రాయవరం స్నేహిత్, మద్దుకూరి మధుమహిత, కార్యక్రమానికి నాంది పలికారు, తర్వాత అంశాల్ని అందించడంలో, రుద్రావఝుల శృతి, సరిదే శ్రేయస్, కార్యంపూడి, పృధ్వీ, కందాడై జగన్, ఎల్లా సంజుల, వనం హర్షిత్, రేమణి చాణక్య, పోలవరం హేమరాజ్, మరియు సిద్దార్థ శ్రియ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వీరందరూ ఒక జట్టుగా పనిచేస్తూ, షేక్ నసీం గారి అమూల్యమైన శిక్షణతో, చక్కటి తెలుగు మాటలతో, ప్రేక్షకుల తెలుగుభాష మరియు చరిత్ర పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలతో కార్యక్రమాన్ని ఆద్యంతమూ రక్తి కట్టించడంలో సఫలీకృతులయ్యారు. అందరి మన్ననలు పొందారు.

 

 

సభను ఉద్దేశించిన ఒక ప్రసంగంలో, మనబడి కులపతి చమర్తి రాజు గారు, సిలికానాంధ్ర అధ్యక్షులు కొండుభట్ల దీనబాబు గారు సిలికానాంధ్ర మనబడి యొక్క ముఖ్య ఉద్దేశ్యాలగురించి, వాటికోసం పాటుపడే జట్టుల గురించి, వారి స్వచ్చంద సేవలవల్ల వస్తున్న ఫలితాల గురించి, పిల్లల తెలుగు నేర్పు గురించి వివరించి, సేవకులుగా మనబడి జట్టులో చేరమని సాటి తెలుగువారికి పిలుపునిచ్చారు. ప్రేక్షకులకి స్పూర్తినిచ్చారు. డాలస్ మనబడి జట్టు తరపున, రాయవరం విజయ భాస్కర్, డాలస్ లో నాలుగేళ్ల మనబడి ప్రగతి గురించి ఇంకా 2012 లో 500 మంది విద్యార్థులు సంఖ్య ఆశయం గురించి సభకు విన్నవించారు.

 

 

బాలగేయాలు, నృత్యాలు, పద్యాలు, లలితగీతాలు, నాటికలు, ఏకపాత్రాభినయాలు మొదలగు లలితకళల అంశాలతో పాటు, త్వరలో తమ నాలుగేళ్ల మనబడి ప్రయాణాన్ని పూర్తిచేసుకోబోతున్న తూర్పు ప్లేనో మరియు కోపెల్ మనబడి కేంద్రాల పిల్లలని ప్రతిభా ఫలకాలను ఇచ్చి సభాముఖంగా వారిని గుర్తించి ప్రోత్సహించడం ఈ సభకే శోభ తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు, యువ తెలుగు రేడియో సారధి కే.సో. చేకూరి గారు, పిల్లలకి దీవెనలతో ప్రశంసాపత్రాలు అందచేశారు. జొన్నలగడ్డ శారద గారి వాఖ్యానంతో, సరిదే సుధీర్ గారి వేదప్రోక్త ఆశీస్సులతో ఈ తంతు పిల్లలకి స్పూర్తిదాయకంగా జరిగింది. చివరిగా, తూర్పు ప్లేనో ప్రభాసం పిల్లలు, రేమణి అపర్ణ గారు నేర్పిన "జయతి జయతి భారత మాత" పాటని అత్యంత శ్రావ్యంగా పాడారు. తర్వాత సభకులంతా కలిసి పాడిన "జనగణమన" జాతీయగీత ఆలాపనతో, సభకు మంగళం జరిగింది. సభానంతరం, విచ్చేసిన అతిథులందరికి షడ్రశోపేతమైన భోజనం, ఒహ్రీన్ భోజనశాల వారి ద్వారా అందింది. చక్కటి ఆంధ్ర వంటలవల్ల, అందరికీ ఎంతో సంతృప్తి కలిగింది.

 

దాదాపు అయిదు గంటల పాటు, ఆ తెలుగు తల్లి ముద్దు బిడ్డలు, ఈ ఎల్లలెరుగని, కల్లలెరుగని పిల్లలు, ఎంతో అద్భుతమైన తెలుగు భాషా ప్రతిభని అందరికీ ప్రదర్శించారు. ఆద్యంతమూ, తెలుగుతల్లి గర్వపడేలా చేసారు. ఇక్కడ పుట్టిపెరుగుతున్న పిల్లలు మనబడిలో తెలుగు నేర్చుకొంటూ, దాదాపు కార్యక్రమం మొత్తం, పిల్లలే నిర్వహించడం వారి ప్రతిభకి, గురువుల శిక్షణకి తార్కాణం. ఇది వారి సాంస్కృతిక ప్రయాణంలో ఇంకో మైలు రాయి. ఈ బాలబాలికలే రేపటి తెలుగు భాషావృక్షానికి వేర్లు. పట్టుకొమ్మని.

 

ఈ కార్యక్రమ వివరాలు వ్రాసి పంపిన రాయవరం విజయ భాస్కర్ గారికి తెలుగువన్ అభినందనలను తెలియచేస్తున్నది


 

TeluguOne For Your Business
About TeluguOne
;