RELATED ARTICLES
ARTICLES
విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!

 

విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!

 

సిలికాన్ వ్యాలి : అమెరికా లోని 35 రాష్ట్రాలు, సౌత్ ఆఫ్రికా, స్విజ్జర్లాండ్, సౌది అరేబియా దేశాలలోని, దాదాపు 500 మంది మనబడి  భాషా సైనికులు, సిలికాన్ వ్యాలీలో జరిగిన 3 రోజుల మహాసదస్సులో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.భాషా సైనికులందరూ కలిసి సదస్సు తొలిరోజున శాన్‌ఫ్రాన్సిస్కో నగరాన్ని సందర్శించి అచ్చమైన తెలుగు వంటకాలతో వనభోజనాలు ఆస్వాదించారు.   మొదటి రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో మనబడి  విద్యార్ధులు అత్యద్భుతంగా ప్రదర్శించిన "శ్రీ కృష్ణ రాయబారం " నాటకానికి స్పందనగా ప్రాంగణంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి కొట్టిన చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. గుమ్మడి గోపాల కృష్ణ గారి దర్శకత్వంలో ఈ నాటకంలోని  పాత్రధారులంతా  ఒకరికొకరు పోటాపోటీగా అత్యంత క్లిష్టమైన సమాసాలతో కూడిన సంభాషణలను, పద్యాలను అలవోకగా పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేసారు.  


సదస్సు:  మనబడి కులపతి రాజు చమర్తి , మనబడి 2016-17 ప్రణాళిక, లక్ష్యాలు, వివరిస్తూ, వాటిని చేరుకోవడం లో సహాయపడే మనబడి క్రియాశీలక బృందాన్ని సదస్యులకు పరిచయం చేసారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ఆనంద్ కూచిభొట్ల, కీలక ఉపన్యాసం చేస్తూ , గత 15 సంవత్సరాలలో సిలికానాంధ్ర సాధించిన విజయాలను వివరించారు.  సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం విభాగాల్లో జనవరి 2017 నుండి తరగతులు ప్రారంభిస్తున్నామని,  తెలియజేసారు.

మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ, ప్రయోగాలకు పుట్టినిల్లైన సిలికానాంధ్ర,తెలుగు బోధనా ప్రమాణాలని మరింత మెరుగుపరచడానికి,  ప్రపంచంలోనే మొదటిసారిగా, మనబడిలో తెలుగును బోధించడానికి, గూగుల్ క్లాస్ రూం పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేసామని తెలిపారు.  శాంతి కూచిభొట్ల, వేణు ఓరుగంటి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 



గ్లోబల్ డెవలప్ మెంట్ ఉపాద్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ, మనబడి గుర్తింపు విభాగం ఉపాధ్యక్షులు శ్రీదేవి గంటి నేతృత్వంలో సిలికానాంధ్ర మనబడి WASC వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా విషయక గుర్తింపు ప్రాధికారిక సంస్థలు,ఇల్లినాయిస్ రాష్ట్రం, మరియు మరెన్నో స్కూల్ డిస్ట్రిక్ట్ లలో తెలుగుకు  ప్రపంచ భాష (World Language) గా గుర్తింపు సాధించామని తెలిపారు. రెండవరోజు సాయంత్రం,  జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ సిలికానాంధ్ర కోసం ప్రత్యేకంగా రచించిన 'మన తెలంగానం ' అనే నృత్య రూపకాన్ని, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు, మనబడి విద్యార్ధులు దాదాపు 100 మంది, స్నేహ వేదుల నృత్య దర్శకత్వంలో ప్రదర్శించి ప్రేక్షకులను తన్మయులను చేసారు.

 

నేను వ్రాసిన ఈ నృత్య రూపకం ఇలా అమెరికా గడ్డ మీద పుట్టిన పిల్లలు చేసి చూపిస్తుంటే.. వారు ప్రదర్శించిన ఇదే వేదికపై చనిపోవాలనుందని సుద్దాల భావొద్వేగానికి లోనయ్యారు.  తన స్పందను వినిపిస్తూ, తాను వ్రాసిన పాటల స్ఫూర్తి ని వివరిస్తూ నేలమ్మ నేలమ్మ వంటి అనేక గీతాలను ఆలపించారు. ఓరుగల్లు కాకతీయ ద్వారం సుస్వాగతం పలుకగా, అచ్చమైన తెలంగాణ పల్లె వాతావరణం ప్రతిబింబించేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు.

 

 

సాయి కందుల నిర్మించిన సాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నమూనా అందరినీ ఆకట్టుకుంది. సిలికానాంధ్ర మనబడి కార్యవర్గ సభ్యులు అచ్చమైన పల్లె సంప్రదాయ దుస్తులతో, వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి పోతరాజు వేషం లో నృత్యం చెస్తుండగా, డప్పులు వాయించి నృత్యం చేస్తూ అతిధులకు స్వాగతం పలకడమే కాకుండా, పదహారణాల తెలుగు భోజనాన్ని దగ్గరుండి వడ్డించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు భాషను ప్రాంతీయ భాష నుండి ప్రపంచ భాషగా తీర్చిదిద్దుతున్న మనబడి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తాము నిరంతరం కృషి చేస్తామని సదస్సుకు వచ్చిన భాషా సైనికులంతా ప్రతిన బూనారు.

 

ఈ సందర్భంగా, ఉపాద్యక్షులు డాంజి తోటపల్లి, విజయభాస్కర్ రాయవరం ఆధ్వర్యంలో,  మనబడి లో ఎన్నో సంవత్సరాలుగా మనబడి లో సేవలందిస్తున్న, భాషా సైనికులని జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి విచ్చేసిన కళాకారులు ఫణిమాధవ్ కస్తూరి, ఇమిటేషన్ రాజుల ధ్వన్యనుకరణ నవ్వులతో ముంచెత్తి, అందరినీ అలరించింది. 

 

 

మనబడి మహాసదస్సు నిర్వహణలో శ్రీదేవి గంటి,  మానస రావ్, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, రత్నమాల వంక, స్నేహ వేదుల,  రవి కూచిభొట్ల, సంజీవ్ తనుగుల, రవి చివుకుల, సిద్దార్ధ్ నూకల, కిషోర్ బొడ్డు, మృత్యుంజయుడు తాటిపామల, జయంతి కోట్ని, జవహర్ కంభంపాటి, శ్రీరాం కోట్ని,లక్ష్మి యనమండ్ర తదితరులు ఎంతో కృషి చేసారు. లైట్ అండ్ సౌండ్ మాంత్రికుడు బైట్ గ్రాఫ్ ప్రశాంత్ మరియు బృందం  తమ స్పెషల్ ఎఫ్ఫెక్ట్లతో ఈ కార్యక్రమానికి అద్భుతమైన  శోభను చేకూర్చారు.

TeluguOne For Your Business
About TeluguOne
;