ఈ పాపిష్టి వైసీపీ వాళ్ళకి పౌరుషానికేం తక్కువ లేదు!

మాచర్లలో సుదీర్ఘకాలంగా అరాచకం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండ్రోజుల క్రితం అరెస్టు చేయడం, నెల్లూరు జైలుకు పంపించడం చకచకా జరిగిపోయాయి. మొన్నటి ఎలక్షన్ల పోలింగ్ సందర్బంగా ఈవీఎం ధ్వంసం చేసిన నేరం మీద ఆయన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఒక్క కేసు మీదే అరెస్టు జరిగింది. ఈ అయ్యగారు చేసిన నేరాలన్నిటి మీదా అరెస్టు చేయాలంటే, దాదాపు ఏ వందసార్లో అరెస్టు చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం ఈవీఎం ధ్వంసం చేసిన నేరం మీదే అరెస్టు చేశారు. 

పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన తన సహజ లక్షణంగా మరోసారి ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆయన గారి తమ్ముడు సక్సెస్‌ఫుల్‌గా పారిపోగలిగాడుగానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పారిపోలేకపోయాడు. దాంతో ఇంట్లోనే వున్న బాత్రూమ్‌లో దాక్కున్నారు. బాత్రూమ్‌లో దాక్కున్నంత మాత్రాన పోలీసులేమీ చెవుల్లో పూలు పెట్టుకుని వెళ్ళిపోరు కదా. బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టినంత పనిచేసి పిన్నెల్లిని అరెస్టు చేశారు. ఆ సందర్భంలో ఇంట్లోంచి బయటకి తెచ్చినప్పుడు కూడా అక్కడ వున్న ఒక టీడీపీ కార్యకర్త మీద పిన్నెల్లి దాడి చేసి పొట్టలో గుభీగుభీమని గుద్దులు గుద్దాడు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా, ఆయన అరెస్టు అయ్యేంత తప్పు చేసినందుకు కాకుండా, తెలుగుదేశం కార్యకర్త అక్కడ వున్నాడని ఫీలైపోయి దాడి చేశారు. సరే, ఈ విషయంలో కూడా మరో కేసు నమోదైంది అది వేరే సంగతి.

ఈ గోల ఇలా వుంటే, పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్తే, పిన్నెల్లి బాత్రూమ్‌లో దాక్కున్నాడని వచ్చిన వార్తలు చూసి వైసీపీ నాయకులు ఓలమ్మో తెగ ఫీలైపోయారు. వెంటనే స్టేట్‌మెంట్ల మీద స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. మా పిన్నెల్లి పిల్లిలాగా పిరికోడు కాదు.. పల్నాటి పులి అని చెప్పుకొచ్చారు. అయ్యా వైసీపీ నాయకులూ.... మీ పిన్నెల్లి పిల్లి కాకపోతే, గతంలో ఒకసారి హౌస్ అరెస్టులో వున్నప్పుడు పోలీసుల కళ్ళుగప్పి ఎందుకు తప్పించుకున్నారు? హైదరాబాద్‌కి ఎందుకు పారిపోయారు? వారాల తరబడి పోలీసులకు దొరక్కుండా దొంగా పోలీస్ ఆట ఎందుకు ఆడారు? పారిపోవడం అనే పాయింట్లో పిన్నెల్లికి కొండవీటి చాంతాడంత చరిత్ర వుంది. కాబట్టి, ఇప్పుడు కూడా తన చరిత్రకి అనుగుణంగానే బాత్రూమ్‌లో దాక్కున్నారు. మీ వైసీపీ నాయకులు చేసేవన్నీ తప్పులు.. దొరికపోతేమాత్రం మా అంత పవిత్రులు ఎవరూ లేరన్నట్టుగా బిల్డప్పులు.