పోలీసుల విచారణలో మాట మార్చిన వైకాపా నేత బెన్నిలింగం

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వైకాపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు బెన్నిలింగం పూటకో మాట మాట్లాడుతున్నారు.  పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యే నని , ఇందులో అనుమానాలకు తావు లేదని చెప్పిన బెన్నిలింగం పోలీసుల విచారణలో  మాత్రం మాట మార్చారు. ఇటీవల ఆయన రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ ‘‘ పాస్టర్ ప్రవీణ్ ది హత్యే. అందులో అనుమానమే లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఉచకోత కోస్తాం, మమ్మల్ని కెలకొద్దు, మేం మంచి వాళ్లం కాదు. మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు’అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బెన్నిలింగంపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు  ఆయనకు నోటీసులు జారి చేశారు. ఈ నోటీసులు అందుకున్న బెన్నిలింగం పోలీసుల విచారణకు హాజరయ్యారు పోలీసుల విచారణకు హాజరైన బెన్నిలింగం మాట మార్చారు.  తనది నరం లేని నాలుక అని నిరూపించే విధంగా ఆవేశంతో  ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.  పోలీసుల ప్రశ్నలకు బెన్నిలింగం నీళ్లు నమిలారు. బెన్నిలింగం సమాధానాలను పోలీసులు వ్రాతపూర్వకంగా స్వీకరించారు. మత కలహాలు ప్రేరేపించే  వ్యాఖ్యలు చేసిన బెన్నిలింగం తాను చెప్పిన మాటలకే కట్టుబడి లేకపోవడం చర్చనీయాంశమైంది.