తమిళనాడు గవర్నర్ కు సుప్రీం షాక్!

గవర్నర్‌ అధికారాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలకు పంపడాన్ని సవాల్ చేస్తూ స్టాలిన్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.  

 ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా,  వాటిని రాష్ట్రపతికి పంపడాన్ని  చట్టవిరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సుప్రీం కోర్టు పేర్కొంది.  ఈ పది బిల్లులను  గవర్నర్ ఒక సారి తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరోసారి గవర్నర్ కు పంపింది. అలా రెండో సారి గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పది బిల్లులూ గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని   జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతొ కూడిన ధర్మాసనం మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు చెప్పింది. గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొంది.  అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే క్లియర్ చేయాల్సి ఉందనీ, అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే బిల్లులను ఆమోదించలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బిల్లులను రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు ఆయన  ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపివేయవచ్చు.

కొన్ని సవరణలతో బిల్లును తిరిగి శాసనసభకు పంపవచ్చు. అయితే, శాసనసభ తిరిగి అంటే రెండో సారిఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదం తెలపాలి.  అయితే తమిళనాడు గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరించారని కోర్టు తప్పుపట్టింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తీసుకునే ప్రతి చర్యను కోర్టు సమీక్షించవచ్చునని పేర్కొంది.