పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం
posted on Jan 8, 2026 3:13PM
.webp)
కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.
మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.