డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు
posted on Jan 8, 2026 1:44PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.
కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.
అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు.