ఇక ఉప ఎన్నికల్లో అన్నిటా 'విజయ'మేనా?
posted on May 28, 2012 11:31AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళటంతో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ అనివార్యంగా వచ్చే ఉప ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాల్సి వచ్చింది. జగన్ అరెస్టు తప్పదని తేలిన తరువాత వై.ఎస్.అర. కాంగ్రెస్ పార్టీ నేతలు ముందు జాగ్రత్తగా విజయమ్మ పేరును తెరపైకి తెచ్చారు. తాను అరెస్టు అయితే తన తల్లి విజయమ్మ ప్రచారం కొనసాగిస్తారని పోటీలో ఉన్న అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఎలా ప్రసంగించాలి, ఎలా ఓటర్లను ఆకట్టుకోవాలి అనే అంశాలపై ఆమెకి నిపుణులతో శిక్షణ కూడా ఇప్పించారు.
ఉప ఎన్నికల ప్రచ్వ్హారానికి ఇక రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో 18 నియోజకవర్గాల్లో పర్యటనకు ఆమె సమాయత్తం అవుతున్నారు. విజయమ్మ ప్రచారంతో పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని, జగన్ అరెస్టు కారణంగా తమ మెజార్టీ మరింత పెరుగు తుందన్న ధీమాతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులున్నారు. భర్తను కోల్పోయి, కొడుకు అరెస్టు అయిన నేపథ్యంలో ఆమె చేయబోయే ప్రచారం తమకు ఎంతో మేలు చేస్తుందన్న ధీమాతో వారు ఉన్నారు. అయితే అభ్యర్థుల ధీమా ఎలా ఉన్నా పార్టీ కార్యకలాపాలను సమన్వయ పర్చడం విజయమ్మకు అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ బాధ్యతలను తన తల్లి చూస్తారని జగన్ పలుమార్లు చెప్పినా ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతూ నేతలను, క్యాడర్ ను కలుపుకుని ముందుకు తీసుకువెళ్ళగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగానే ఉన్నారు తప్ప పార్టీ వ్యవహారాల్లో ఆమె ఏనాడూ చురుకుగా పాల్గొనలేదు. జగన్ పై ఉన్న నమ్మకంతో విజయమ్మే నాయకురాలంటూ బయటికి చెబుతున్నా ఆమె నాయకత్వ సామర్థ్యం పై అనేక మంది నేతలు లోలోన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.