జగన్ అరెస్టు స్వయంకృతమే?
posted on May 28, 2012 11:35AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముందుచూపు లేకుండా మొండిగా వ్యవహరించి అధికార దాహంతో నిర్ణయాలు తీసుకోవడమ వల్లే ఆయనకు ఈ దుస్థితి ఏర్పడింది. తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏనాడూ అధిష్టానాన్ని ధిక్కరించలేదు. అధికారం కోసం నిరంతరం శ్రమించారు తప్ప ఎక్కడా తొందరపడలేదు. కానీ, జగన్ మాత్రం అందుకు భిన్నంగా అధిష్టానంతో ఢీకొన్నారు. తనకు మద్దతునిస్తున్న శాసనసభ్యుల అండ చూసుకుని తన దయవల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని చిటికెలు వేస్తూ చెప్పారు. తన పార్టీ నేడో రేపో అధికారంలోకి వచ్చేస్తుందన్న ధీమాతో ప్రజలకు వాగ్ధానవర్షాలు కురిపించారు
తప్పుల మీద తప్పులు చేసి తిప్పలు తెచ్చుకున్నారు. స్వతహాగా మొండితనం, ఎవరినీ లెక్కచేయనితనం, తల్లిదండ్రుల మాట ధిక్కరించే నైజం ఉన్న వ్యక్తిగా జగన్ పేరు తెచ్చుకున్నాడు. తన కుమారుడు తన మాట వినటం లేదన్న నిస్సహాతను దివంగత వై.ఎస్.రాజేశేఖరరెడ్డి తన సన్నిహితుల మధ్య పలుమార్లు వ్యక్తం చేశారు. తల్లి విజయలక్ష్మిని సైతం జగన్ ఎదిరించేవాడని, అందుకే ఆయనను ఎక్కువకాలం బెంగుళూరుకె పరిమితం చేయాల్సి వచ్చిందని వై.ఎస్. సన్నిహితులు చెబుతున్నారు. జగన్ తీరుపై విజయమ్మ ఒక సందర్భంలో కళ్ళనీళ్ళు పెట్టుకుని వాపోయినట్లు రాష్ట్ర సీనియర్ మంత్రి ఒకరు తెలుగువన్.కామ్ కు తెలిపారు. దుందుడుకు స్వభావి అయిన జగన్ తన తండ్రికి ఆత్మలాంటి వ్యక్తిపై కూడా దురుసుగా ప్రవర్తించారని, కొందరు సీనియర్లపై చేయి చేసుకున్నారన్న విమర్శలు గతంలో వచ్చాయి. తన తండ్రి సీటుకు తానే వారసుడినన్న మొండిపట్టుదలే జగన్ ను రోడ్డుకీడ్చింది. తన తండ్రి వల్లే రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వై.ఎస్. మరణానంతరం ఆయన వారసుడైన తనను అధిష్టానం నిర్లక్ష్యం చేసి పక్కకు పెట్టిందని జగన్ అనుమానించారు. ఆ అనుమానమే పెనుభూతంగా మారి చివరికి ప్రత్యేక పార్టీ ఏర్పాటుకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అంటూ జగన్ జబ్బలు చరిచాడు. అధిష్టానం సిబీఐ అస్త్రాన్ని ప్రయోగించి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టింది.