వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమానికి వైకాపా ఆలోచన!

 

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళలో తన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకొని ఉండి ఉంటే ఎన్నికలలో ఫలితాలు మరోలా ఉండేవేమో? కానీ ఆయన నేరుగా ఆ పని చేయకుండా ఓదార్పు యాత్రలు, సమైక్యాంధ్ర ఉద్యమాల ద్వారా ఆ పనిని చక్కబెట్టాలని ప్రయత్నించడంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోయింది. కానీ ఇప్పుడు కూడా ఆయన ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీని బలంగా నిర్మించుకోకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమించేందుకు సిద్దం అవుతుండటం గమనిస్తే ఆయన మళ్ళీ అదే పొరపాటు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు కనబడుతోంది.

 

జగన్ అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దు హామీలపై ప్రభుత్వాన్నినిలదీసేందుకు వచ్చేనెలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమించాలని ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్దం చేసుకొన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ప్రజావేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం.

 

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకి ప్రజల తరపున నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఎత్తిచూపుతూ దానిని నిరంతరం అప్రమత్తంగా ఉంచే బాధ్యత ఉంటుంది. వైకాపా కూడా ఆ పాత్ర పోషిస్తే అందరూ హర్షిస్తారు. కానీ జగన్ ఈ అంశాన్ని తీసుకొని ఉద్యమించి తద్వారా తన పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రాజకీయంగా బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. అది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుకు అవసరమయిన నిధులు సమీకరించుకొని, ఈనెలాఖరు నుండి దశలవారిగా రుణాల మాఫీ అమలుచేయడానికి సిద్దపడుతోంది. ఈ సంగతి వైకాపాకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఒకేసారి మొత్తం వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేసే పరిస్థితిలో లేదని గ్రహించిన జగన్, రైతులను ప్రేరేపించి వారితో కలిసి ఈ అంశంపై ఉద్యమించి, తద్వారా  గ్రామ స్థాయి నుండి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తునట్లున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రుణ మాఫీ కార్యక్రమం మొదలుపెడితే వైకాపాకు ప్రజలలో భంగపాటు తప్పకపోవచ్చును.

 

జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోదలిస్తే ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకొంటే ఫలితం ఉండేది. కానీ ఆయన ఆ పని చేయకుండా ఉద్యమిస్తే స్వంత సైన్యం లేకుండా కిరాయి సైన్యంతో యుద్దానికి బయలుదేరినట్లవుతుంది. ఈ విషయం ఇటీవల జరిగిన ఎన్నికలలో నిరూపితమయింది. కానీ అది గ్రహించకుండా వైకాపా మళ్ళీ అదే పొరపాటు చేయదలిస్తే మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతుంటాయి తప్ప ఏమీ సాధించేది ఉండబోదని వైకాపా గ్రహించాల్సిన అవసరం ఉంది.