మీడియాపై ఆంక్షలు ఇంకా ఎన్నాళ్ళు?

 

ఆంద్రజ్యోతి, టీవీ-9 న్యూస్ చానళ్ళపై గత మూడు నెలలుగా కొనసాగుతున్న అప్రకటిత నిషేధంపై ఇంతవరకు ఎంతమంది ఎన్ని విధాల పోరాడినా ఫలితం లేకుండాపోయింది. తెలంగాణా ప్రభుత్వం ఈ నిషేదంలో తన ప్రమేయం లేదంటూనే దానిని ఎత్తివేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తూ దానిపై తన వైఖరిని చెప్పకనే చెపుతోంది. మూడు నెలలుగా ఆ రెండు న్యూస్ చానళ్ళపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ గవర్నరు, కేంద్రం, కోర్టులు గానీ ఏమీ చేయలేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వారి ఈ నిర్లిప్తత ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటివని చెప్పక తప్పదు.

 

ఆ కారణంగానే యం.యస్.ఓ.లు కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ విజ్ఞప్తులను, హెచ్చరికలను బేఖాతరు చేయగలుగుతున్నారని చెప్పక తప్పదు. ఆ కారణంగానే గత మూడు నెలలుగా ఆ రెండు న్యూస్ చానళ్ళు తమ ప్రసారాలు పునరుద్దరణకు చేస్తున్నపోరాటం ఫలించడం లేదని చెప్పవచ్చును. ఆ కారణంగానే తెలంగాణా ప్రభుత్వం కూడా ఉదాసీనత చూపుతోందని భావించవలసి ఉంటుంది.

 

అయితే మొన్న హైదరాబాదులో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముందు మౌనంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టులపై పోలీసులు పాశవికంగా వ్యవహరించడం, ఆ తరువాత నిన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై చేసిన దురుసు వ్యాఖ్యలతో యావత్ మీడియా లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొంది. యావత్ మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీకూడా మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలని, మీడియాపై నిషేధాన్ని ముక్త కంఠంతో ఖండించాయి.

 

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమయిన వ్యవస్థలయిన ప్రభుత్వం, మీడియా మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం రెంటికీ మంచిది కాదు. ఇదింకా కొనసాగినట్లయితే ఇదొక దుసంప్రదాయంగా మారే ప్రమాదం కూడా ఉంది. మీడియా తప్పు చేసిందని తెలంగాణా ప్రభుత్వం ఆగ్రహించడం సహజమే. కానీ మీడియాపై నిషేధం కొనసాగిస్తే అది కూడా తప్పే అవుతుంది. అదేవిధంగా మీడియా కూడా మీడియా స్వేచ్చ పేరిట హద్దులు మీరకుండా స్వీయ నియంత్రణ పాటించడం కూడా అత్యవసరం. కనుక తెలంగాణా ప్రభుత్వం ఇకనయినా మీడియాపై నిషేధం ఎత్తివేసేందుకు చొరవ చూపితే అందరూ హర్షిస్తారు.