బండిగా, గుండుగా.. అని తిట్టినా భరిస్తారా? బీజేపీలో విభేదాలా? వ్యూహాత్మక మౌనమా?
posted on Aug 17, 2021 3:19PM
పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు.. ఈమధ్య తెలంగాణ బీజేపీపై వరుస దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మునుపు దూకుడే మంత్రంగా దూసుకుపోయిన కమలనాథులు ఈసారి వ్యూహాత్మకంగా సంయమనం పాటిస్తున్నట్టున్నారు. రెచ్చగొట్టి.. సైడైపోతున్నారే గానీ.. అదే పనిగా రెచ్చిపోవడం లేదు. పలు సందర్భాల్లో కాషాయవాదుల బిహేవియర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. కాస్త జాగ్రత్తగా విశ్లేషిస్తే.. మొదట్లో ఎరక్కపోయి ఇరుక్కుపోయినా.. ఆ వెంటనే తేరుకొని.. మరింత కిరికిరి కాకుండా గ్రేట్ ఎస్కేప్ అవుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వ్యూహం బీజేపీకి బాగా కలిసొస్తోందని కూడా చెబుతున్నారు. తాజా, మైనంపల్లి ఎపిసోడ్‌తో మరోసారి కమలనాథులు చర్య-ప్రతిచర్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
జెండావందనానికి వస్తే.. మల్కజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మనుషులు దాడి చేసి కొట్టారనేది ప్రధాన ఆరోపణ. అరుపులు, కేకలు, కార్పొరేటర్ చొక్కా చిరిగిన విజువల్స్ బాగానే వైరల్ అయ్యాయి కానీ, దాడి దృశ్యాలు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం కాస్త అనుమానాస్పదం. ఆ విషయం పక్కనపెడితే.. ఎంత ధైర్యం మా కార్పొరేటర్‌నే కొడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే మల్కాజ్‌గిరిలో వాలిపోయారు. గతంలో జనగాంలో బీజేపీ యువనేతను పోలీసులు లాఠీలతో చితకబాదితే కూడా వెంటనే జనగాంలో పర్యటించి వారిలో ధైర్యం నూరిపోశారు బండి సంజయ్. దుబ్బాల ఎన్నికల సమయంలోనూ ఇలానే స్పందించారు రాష్ట్ర అధ్యక్షుడు. బండి సంజయ్ వచ్చాక సామాన్య కార్యకర్తకు సైతం దళపతి నుంచి బలమైన అండా-దండా లభిస్తోంది. మల్కాజ్‌గిరిలోనూ అదే జరిగింది. బీజేపీ కార్పొరేటర్‌ను పరామర్శించి.. ఎమ్మెల్యే మైనంపల్లిపై నోరు పారేసుకున్నారు బండి. ఫాల్తుగా అని తిడుతూ.. మర్డర్‌లు, కబ్జాలు బయటపెడతానంటూ మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చారు సంజయ్.
బండి ఓ మోస్తారుగా తిడితే.. జగమొండి మైనంపల్లి ఓ రేంజ్‌లో సంజయ్‌పై విరుచుకుపడ్డారు. అరేయ్ బండిగా.. గుండుగా.. కొజ్జాగా.. వుమెనైజర్.. కార్పొరేటర్ స్థాయి.. ఎమ్మెల్యేగా ఓడిపోయి.. కరీంనగర్ గడ్డపై చూసుకుందాం.. అంటూ బండి సంజయ్‌పై తిట్లదండకం అందుకున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి. మామూలుగానైతే బీజేపీ అధ్యక్షుడిని ఈ రేంజ్‌లో కుమ్మేస్తే.. కమలనాథులు ఆ మర్నాడు అల్లకల్లోలమే చేసేవారు. అయితే.. పెద్దగా రచ్చేమీ జరిగినట్టులేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాస్త కౌంటర్ ఇచ్చారు. మిగతా బీజేపీ పెద్దలెవరూ పెద్దగా స్పందించలే. మైనంపల్లిపై విరుచుకుపడలే, తమ నాయకుడికి మద్దతుగా నోరు మెదపలే. అక్కడక్కడా జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగినా.. అవి ఎదురుదాడి స్థాయిలో జరగలే. ఇదే ఇప్పుడు అనుమానాలకు కారణమవుతోంది. బీజేపీ అధ్యక్షుడు ఒంటరివాడు అయ్యారా? ఆయనకు మిగతా పార్టీ నాయకులు అంతగా సహకరిస్తలేరా? లోలోన మంచిగైందని ఖుషీ అవుతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు.
అయితే, బీజేపీలో అలాంటి లుకలుకలు ఏమీ లేవని అంటున్నారు. ఎందుకంటే.. మైనంపల్లి విమర్శలపై బండి సంజయ్ సైతం స్పందించలేదని గుర్తు చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మక మౌనమేనంటున్నారు. గతంలోనూ జరిగిన కొన్ని పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ హిందూదేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసినప్పుడు సైతం మొదటగా బండి సంజయ్ ఆరోపణలకు దిగారు. స్వేరోస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.. ఏకంగా బండి వాహనంపైనే దాడి జరిగింది. అయినా, కమలనాథులు రెచ్చిపోలేదు. అప్పటివరకూ హంగామా చేసిన బీజేపీ వెంటనే మౌనం పాటించింది. ఇష్యూని పెద్దది చేయలేదు. దీంతో.. రెండు మూడు రోజుల్లోనే స్వేరోస్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడింది.
అటు, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే.. బండి.. గుండు అంటూ సంజయ్‌పై, అర్వింద్‌పై అటాక్‌కు దిగారు. రేవంత్‌రెడ్డి ఎంత కవ్విస్తున్నా.. ఎక్కడా కమలనాథులు కయ్యానికి కాలు దువ్వడం లేదు. కామ్‌గా అన్నీ మూసుకొని బరిస్తూ వస్తున్నారు. ఇలా.. మైనంపల్లి, స్వేరోస్, రేవంత్‌రెడ్డి.. ఏ ఇష్యూలోనూ బీజేపీ కానీ, బండి సంజయ్ కానీ మునుపటి దూకుడు ప్రదర్శించకుండా.. చాలా వ్యూహాత్మకంగా సైడ్ అయిపోతున్నారు. ఇదే కొన్ని రాజకీయ వర్గాలను కన్ఫ్యూజ్ చేస్తోంది. దూకుడు బేస్ మీదనే బండిని రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. అలాంటిది.. బండి సంజయ్‌నే పట్టుకొని ప్రత్యర్థి వర్గాలు అంత తిడుతున్నా.. అటాక్ చేస్తున్నా.. మౌనం పాటించడం వెనుక పెద్ద రీజనే ఉందంటున్నారు.
బీజేపీ మెయిన్ టార్గెట్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం. కమలనాథుల ప్రధాన లక్ష్యం.. సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బ తీయడం. అంతేగానీ, స్వేరోస్‌తో గొడవ పడితే వారికొచ్చే లాభమేమీ లేదు. రేవంత్‌రెడ్డి నోట్లో నోరు పెడితే.. నష్టమే తప్ప ఉపయోగమేమీ ఉండదు. ఇక మైనంపల్లి లాంటి ఎమ్మెల్యే స్థాయి లీడర్‌తో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తలపడితే.. అది బండి ఇమేజ్‌కే డ్యామేజ్. అందుకే, మైనంపల్లి పర్సనల్‌గా అంతగా తిట్టినా.. తుడిచేసుకొని మౌనంగానే ఉన్నారు కానీ.. మళ్లీ కౌంటర్ అటాక్ మాత్రం చేయలేదని చెబుతున్నారు. బీజేపీ కానీ, బండి సంజయ్ కానీ.. నేరుగా సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీతో మాత్రమే కలబడాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే, చిన్నాచితకా ఇష్యూల్లో పొరబాటున ఎంట్రీ అయినా.. మళ్లీ వెంటనే సైడ్ అయిపోతున్నారని అంటున్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న ఎత్తుగడ అని విశ్లేషిస్తున్నారు. కారణం, అవసరం ఏదైనా కానీ.. మైనంపల్లి అన్నేసి మాటలు అన్నాక కూడా కమలనాథులెవ్వరూ చిన్న కౌంటర్ కూడా ఇవ్వకపోవడం ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పంపుతోందనే వారు కూడా ఉన్నారు.