ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఆటలో అరటిపండేనా?
posted on Jan 4, 2025 1:04PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు ఇంకా సమాయత్తమైనట్లు కనిపించడం లేదు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలంటూ ఆప్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయన్న విషయాన్ని తేటతెల్లం చేసేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ పరిస్థితి ఆటలో అరటిపండులా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్యే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.
గత దశాబ్దంగా ఢిల్లీ పీఠం అప్ చేతిలోనే ఉంది. దీంతో బీజేపీ ఆప్ లక్ష్యంగా వ్యూహాలు రచించి అందుకు అనుగుణంగా తన ప్రచార ప్రణాళికను రచించుకుంటోంది. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విషయంలో పూర్తిగా మోడీ కరిష్మాపైనే ఆధారపడిందనడంలో సందేహం లేదు. హిందుత్వ అజెండాను ప్రముఖంగా తెరపైకి తీసుకురావడం, అలాగే ఆప్ అవినీతి పార్టీ అంటూ చాటడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఆప్ యమున ప్రక్షాళనకు వ్యతిరేకం అంటూ ఉద్ఘాటించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు అరెస్టైన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంపైనే బీజేపీ దృష్టి పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే ప్రధాని మోడీ తన ప్రచార శంఖారావాన్ని పూరించారు.
ప్రధాని మోడీ శుక్రవారం (జనవరి 3)న ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీలో కేంద్రం నిర్మించిన గృహాలను పేదలకు పంపిణీ చేయడం కోసం చేసిన ఈ పర్యటనను ఆయన ఎన్నికల ప్రచారం కోసం పూర్తిగా వాడుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందనీ, స్వయంగా ఆ పార్టీ అగ్రనేతలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనీ విమర్శలు గుప్పించారు. గుజరాత్ వ్యాపారి ఇచ్చిన పది లక్షల రూపాయల విలువైన సూటు ధరించారనీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ప్రధాని తన నివాసాన్ని నిర్మించుకున్నారనీ ఘాటు విమర్శలు చేశారు. ఆ విమర్శలు, ప్రతి విమర్శలతో శీతాకాలంలో వణికించే చలిలో కూడా ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ రాజకీయ వేదికపై కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పాత్ర, పోటీ నామమాత్రంగానే ఉంటుందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.