వైఎస్ వారసత్వానికి పోటీ .. విజయం షర్మిలదేనా?!

దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇప్పుడు నిట్టనిలువుగా చీలిపోయిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుమారుడు జగన్ ఒక వైపు ఉంటే.. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఇతర బంధువులు మరో వైపు నిలిచారు. వైఎస్ మరణం తరువాత కుటుంబం మొత్తం జగన్ కు అండదండగా నిలిచి వైఎస్ వారసుడిగా ఆయనను జనం ముందు ప్రొజెక్ట్ చేసింది. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించిన సమయంలో కూడా వైఎస్ కుటుంబం మొత్తం జగన్ వెనుకే నిలిచింది. సరే జగన్ ను జనం వైఎస్ వారసుడిగా భావించి 2019 ఎన్నికలలో ఘన విజయాన్ని కట్టబెట్టారు. అయితే జగన్ మాత్రం జనం నమ్మకాన్నీ నిలుపుకోలేదు. కష్ట సమయంలో తనకు అండదండగా నిలిచిన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలనూ దూరం పెట్టారు.  

వైసీపీ అనేది  జగన్  చెందిన సొంత కంపెనీ. ఆ పార్టీకి ఒక రాజకీయ సిద్ధాంతం ఉన్నట్లు కనిపించదు. జగన్ తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీని ప్రారంభించారు. అందుకు అప్పట్లో ఆయన కుటుంబమూ వంత పా డింది. వైఎస్ అభిమానులు సైతం జగన్ పక్కన నిలబడ్డారు. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదు. కానీ జగన్ అధికార అందలం అందుకున్న తరువాత తన వైసీపీ పార్టీలో వైఎస్ బ్రాండ్ ను కనుమరుగు చేసి సొంత ఇమేజ్ పెంచుకోవాలని భావించారు. ఈ విషయంలో కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  అయితే  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తన పెత్తనాన్ని, పార్టీపై ఆధిపత్యాన్ని పదిలం చేసుకోవడానికి అధికారంలో వాటా అడుగుతుందన్న భయంతో సొంత చెల్లి షర్మిలను పార్టీ నుంచే కాదు రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయేలా పొగబెట్టారు. ఆమెకు మద్దతుగా మాట్లాడారంటూ తల్లి విజయమ్మను కూడా దూరంపెట్టారు. పండుగలా జరుపుకోవలసిన పార్టీ ప్లీనరీ వేదికగా మెలో డ్రామాకు తెరలేపి తల్లి చేత వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించి పంపేశారు. షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేసినంత కాలం వైఎస్ వారసత్వం విషయంలో షర్మిలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్ వారస్త్వం విషయంలో జగన్ కు పోటీ అనేదే లేకుండా పోయింది.

అయితే ఎప్పుడైతే షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగు పెట్టారో అప్పుడే అన్నా చెళ్లెళ్ల మధ్య వారసత్వ పోరు షురూ అయ్యింది. ఇటీవలి ఎన్నికలలో జగన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో వారసత్వ పోరులో ఆయన చతికిలబడిపోయారు. ఆ ఎన్నికలలో షర్మిల కూడా  విఫలమయ్యారు. రాష్ట్రంలో  ఆ పార్టీ జీరో అక్కౌంట్ పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదు. అయినా రాజకీయంగా షర్మిల జగన్ పై పైచేయి సాధించారు. ఇందులో ఎలాంటి సందేహాలకూ తావులేదు.  

పైపెచ్చు రాజకీయంగ వైఎస్ ఎదుగుదలకు, ఆయన ముఖ్యమంత్రి కావడానికీ, అన్నిటికీ మించి చివరి వరకూ ఆయన కొనసాగిన పార్టీలో ఉండటం  షర్మిలకు వైఎస్ రాజకీయవారసత్వ రేసులో ఒక అడ్వాంటేజ్ గా మారింది. ఇప్పుడు వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఆమె కాంగ్రెస్ బ్యానర్ కింద నిర్వహించడంతో ఇంకా ఎవరికైనా ఏ మూలనైనా అనుమానాలు మిగిలి ఉంటూ అవన్నీ నివృత్తి అయిపోయాయి. దీంతో వైఎస్ వారసత్వ పోరులో షర్మిల జగన్ ను వెనక్కు నెట్టేసి ముందుకు దూసుకుపోతున్నారు.